టాలీవుడ్లోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడు అయిపోయాడు అనిల్ రావిపూడి. వరుసగా నాలుగు హిట్లు. అందులో నాలుగో హిట్టు బ్లాకు బ్లస్టరు. దిల్ రాజు కెరీర్లోనే ఇన్ని లాభాలు ఎప్పుడూ చూడలేదన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. అలాంటి హిట్టిచ్చాడు మరి. అలాంటప్పుడు మోస్ట్ వాంటెడ్ కాకుండా ఎలా ఉంటాడు? టాప్ హీరోలు సైతం అనిల్ రావిపూడి మంచి కథ చెబుతాడేమో చేద్దాం అన్నట్టు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ దశలో అనిల్ కన్ను లేడీ ఓరియెంటెడ్ సినిమాపై పడింది.
అవును…. అనిల్ రావిపూడి దగ్గర ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఉందట. దాన్ని పట్టాలెక్కిద్దామని భావిస్తున్నాడని తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ అంటే.. హార్రర్లూ, థ్రిల్లర్లు అనుకుంటారు. కానీ ఈ కథ ఆ టైపు కాదట. ఇదో మంచి కమర్షియల్ సినిమా అని, ఓ హీరోని తెరపై ఎలా చూడాలనుకుంటామో, అలా ఓ హీరోయిన్ని చూపించబోతున్నాడని తెలుస్తొంది. `ఎఫ్ 2` తరవాత అనిల్ చేయబోయే సినిమా అదో కాదో స్పష్టంగా తెలీదు గానీ, అతి త్వరలోనే తనో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం ఖాయం. ఇలాంటి కథలంటే గుర్తొచ్చేది అనుష్క, సమంతలే. అనిల్ కూడా వీరిద్దరినే దృష్టిలో ఉంచుకున్నాడా? లేదంటే… మరో కథానాయిక వైపు చూస్తాడా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.