బీఆర్ఎస్ నుండి మరో వికెట్ పడబోతుంది. ఇప్పటికే 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా… 11వ ఎమ్మెల్యే కూడా చేరబోతున్నారు. సంప్రదింపులు ముగిశాయని, ఈరోజు రుణమాఫీ తర్వాత కానీ శుక్రవారం కానీ సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మార్పుపై లీకులిస్తోంది. L అనే అక్షరంతో పేరున్న ఎమ్మెల్యే రాబోతున్నారని, 11వ వికెట్ ఔట్… ఇలా చెప్పి చెప్పనట్లుగా మైండ్ గేమ్ ఆడుతోంది.
అయితే, ఆ 11వ ఎమ్మెల్యే ఎవరు అన్న చర్చ ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ లోనూ జరుగుతోంది. కొన్ని రోజులుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు పలువురు గ్రేటర్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. వారంతా ఎప్పుడు పార్టీలో చేరాలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. దీంతో ఇప్పుడు చేరబోయే ఎమ్మెల్యే కచ్చితంగా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన ఎమ్మెల్యే ఉంటారని పార్టీ వర్గాలంటున్నాయి.
తమ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం రైతన్నలకు రుణమాఫీ చేసిందని, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకకాలంలో చేస్తున్నామని ఘనంగా చెప్పుకుంటుంది. గతంలో కేసీఆర్ రుణమాఫీ హామీ ఇచ్చి చేయలేకపోయారని గుర్తు చేస్తూ, రుణమాఫీ వల్లే తాను పార్టీ మారినట్లు ఉండేలా ఎమ్మెల్యే చేరిక ఉంటుందన్న చర్చ సాగుతోంది.
కొన్ని రోజులుగా ఎమ్మెల్యేల వలసలు ఆపేందుకు బీఆర్ఎస్ కేసుల ప్రస్తావన తెస్తోంది. బుధవారం కూడా హరీష్ రావు… తాము సుప్రీంకోర్టును ఆశ్రయించి అయినా సరే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని, వారిని మాజీలను చేస్తామంటూ ప్రకటించారు.
అందుకే చివరి నిమిషం వరకు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పేర్లపై గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది.