సినిమా ప్రపంచంలో ఓటీటీ భాగం అయిపోయింది. సినిమా వ్యాపారంలో ఓటీటీలదే కీలక భాగస్వామ్యం. అందుకే ఓటీటీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మీడియా రంగంలో అగ్రగామిగా నిలిచిన ఈనాడు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టింది. ‘ఈటీవీ విన్’ పేరుతో ఓటీటీ సంస్థ నడుస్తోంది. అయితే ఇప్పుడు మరో వెంచర్ లాంచ్ చేయడానికి `ఈనాడు` సిద్ధమైంది. ఈసారి ‘ఆర్.ఎమ్.ఎమ్’ పేరుతో ఈ ఓటీటీ రాబోతోంది. రామోజీ మూవీ మ్యాజిక్ అన్నమాట. ‘ఈటీవీ విన్’ తెలుగు సినిమాలకు పరిమితమైంది. అయితే ‘ఆర్.ఎమ్.ఎమ్’ మాత్రం నెట్ఫ్లిక్స్ రేంజ్లో అన్ని భాషల సినిమాలకూ వేదిక కానుంది. అందుకోసం ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. ఈ దసరాకు అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. ‘ఆర్.ఎమ్.ఎమ్’ కోసం ఇప్పటికే కొన్ని సినిమాలు రెడీ చేశారని, వాటి వివరాల్ని కూడా త్వరలో చెబుతారని సమాచారం.
‘ఈటీవీ విన్’ చిన్న సినిమాలకు, చిన్న బడ్జెట్ కే పరిమితం అయ్యింది. చందాదారులు కూడా అంతంత మాత్రమే. అయితే ‘ఆర్.ఎమ్.ఎమ్’ టార్గెట్ చాలా పెద్దదిగా ఉందని తెలుస్తోంది. తమ కంటెంట్ తోనే చందాదారుల్ని పెంచుకోవాలని, ప్రస్తుతం ఓటీటీ రంగంలో అజమాయిషీ చేస్తున్న మిగిలిన ఛానళ్లకు ప్రత్యామ్నాయంగా మారాలని ‘ఆర్.ఎమ్.ఎమ్’ చూస్తోంది. ఓటీటీల్లోకి మరో కొత్త ఛానల్ రావడం, అది కూడా ఈనాడు లాంటి సంస్థ నుంచి రావడం ఆహ్వానించదగిన పరిణామం. మరి.. ‘ఆర్.ఎమ్.ఎమ్’ ఓటీటీ రంగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలంటే కొంతకాలం ఆగాలి.