మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్స్గా మారిపోయాడు సిద్ద్ శ్రీరామ్. ప్రతీ ఆల్బమ్ లోనూ… తన పాట ఒకటి తప్పకుండా ఉంటుంది. సిద్ పాడాడంటే ఆ పాట కచ్చితంగా హిట్టే. అలాంటి మరో పాట.. సిద్ద్ శ్రీరామ్ నుంచి వచ్చింది. అదే `అచ్చతెలుగందమే`.
జయదేవ్ గల్లా తనయుడు, మహేష్ బాబు చుట్టం.. అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `హీరో`. నిధి అగర్వాల్ కథానాయిక. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమా నుంచి తొలి గీతం `అచ్చతెలుగందమే` రానా చేతుల మీదుగా విడుదలైంది. జిబ్రాన్ స్వరపరిచిన ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు. సిద్ద్ పాడాడు.
హీరో – హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ గీతమిది. అమ్మాయి ఓ మెడీకో. అబ్బాయి.. తుంటరివాడు. అమ్మాయి పరిచయాన్ని, స్నేహాన్ని, ప్రేమని – వర్ణిస్తూ, ఆ అనుభూతిలో విహరిస్తూ అబ్బాయి పాడుకునే పాట ఇది. నిధి చాలా అందంగా కనిపిస్తోంది. అశోక్.. స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే టాలీవుడ్ కి మరో మంచి యువ హీరో వచ్చినట్టే అనిపిస్తోంది. పాట ఎంత వినసొంపుగా ఉందో.. అందులోని భావాలు అంతగా ఆకట్టుకుంటున్నాయి.
నింగిలో తారక.. నేలపై వాలెనే
కన్నుల పండగై… కాలమే ఆగెనె..
ప్రేమనే బాణమే.. నన్నిలా తాకెనె..
నేననే ప్రాణమై.. నీకులా మారెనె… అంటూ మొదలైన పాట ఇది.
తొలి చరణంలో
ఇప్పటి వరకు ఇలా..
మనసు తన చప్పుడు వినలేదు కదా
,నిన్నటి వరకు కల
అసలు తన రంగులు తను కనలేదు కదా.. పదాలు బాగా పడ్డాయి.
రెండో చరణంలో ఓ చోట
ఎప్పుడు చెరిగినదో సిగ్గుల సరిహద్దు
చపప్ఉన దొరికినదే చక్కెర తొలి ముద్దు
చుంబనాల సంబరాల దారిగా
నాకు నువ్వు నీకు నేను సంతకాలు చేసినాను – అన్న చోట శాస్త్రి కలం.. మరింత బాగా పరుగులు తీసింది.
మొత్తానికి… ఓ చక్కటి మెలోడీ విన్న పీలింగ్ కలిగింది. కొంతకాలం ఈ పాట.. మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది.