ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సీన్ మారుతోంది. ఇప్పటి వరకూ ప్రో వైసీపీ నేతల ఏలుబడిలో ఉన్న బీజేపీ అధికార పార్టీకి బీ టీంగా మారింది. విపక్షాన్ని టార్గెట్ చేసే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఏం జరిగినా ముందు టీడీపీని విమర్శించి.. చివరిలో కొద్దిగా వైసీపీని విమర్శించేవారు. ఇటీవల అమిత్ షా పర్యటన తర్వాత సీన్ మారిపోయింది. సోము వీర్రాజుకు పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదు. గతంలో ఆయన సస్పెన్షన్ వేటు వేసిన వారినందర్నీ మళ్లీ తీసుకున్నారు. ఏ మీడియాపై తాము నిషేధం విధించలేదని ఏబీఎన్ విషయంలో ప్రకటించాల్సి వచ్చింది.
ఇప్పుడు మీడియా ముందుకు కూడా ఆ వర్గానికి చెందిన నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. అధికారిక ప్రకటనలు.. నిర్ణయాలు ఇతరులు తీసుకుంటున్నారు. తాజాగా సీఎం రమేష్ ఎక్కువగా పార్టీని లీడ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సంచలన కామెంట్లు చేశారు. ఆయన కామెంట్లు సహజంగానే ఐపీఎస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వంపై పోరాటానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. 28తేదీ ఏపీ ప్రభుత్వంపై ప్రజాగ్రహ సభ పేరుతో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలంతా.. ప్రో వైసీపీగా ముద్రపడిన వారితో సహా అందరూ వైఎస్ జగన్ సర్కార్‌పై విరుచుకుపడేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే ఈ మార్పు ఢిల్లీ స్థాయిలోనే వచ్చిందని.. ఇప్పటి వరకూ చూసీ చూడనట్లుగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు వైసీపీ సర్కార్‌పై ప్రజాగ్రహం పెరిగిపోయిందన్న కారణంనే దూకుడుగా ఉండాలని ఆదేశిస్తోందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. మొత్తంగా చూస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కన్నెర్ర చేస్తే.. ఏపీలో లొసుగులతో సాగుతున్న పాలన రోడ్డు మీద పడుతుందన్న అభిప్రాయం ఉంది. వైసీపీపై రాజకీయ పోరాటంలో బీజేపీ విధానం ఏంటో ఇరవై ఎనిమిదో తేదీన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.