జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తేజ సినిమా పూర్తి కాకుండానే, మరో సినిమాని పట్టాలెక్కించాడు. తమిళ రీమేక్ ‘రాక్షసన్’ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేశారు. అధికారికంగానూ ఆమె పేరు ప్రకటించేశారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. బెల్లంకొండ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వచ్చే వారంలో అనుపమ పరమేశ్వరన్ సెట్లోకి అడుగుపెట్టనుంది. ‘వీర’ సినిమా తరవాత రమేష్ వర్మ చేస్తున్న సినిమా ఇది. తను సొంతంగా ఓ కథ రెడీ చేసుకుని బెల్లంకొండని ఒప్పించాడు. కాకపోతే… ఆ కథని పక్కన పెట్టి ‘రాక్షసన్’ రీమేక్‌ని మొదలెట్టారు. ఈ సినిమాకి సరిపడ తెలుగు టైటిల్ కోసం చిత్రబృందం అన్వేషణ సాగిస్తోంది.