తెలుగులో హీరోయిన్స్ కొరత వుందన్న మాట తరుచూ వినిపిస్తుంటుంది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి మాత్రం కాస్త విచిత్రంగా వుంది. ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోయిన్స్ చేతిలో పెద్దగా సినిమాలేం లేవు. కొత్త హీరోయిన్లు ఓ పక్క దూసుకుపోతోంటే, స్టార్ హీరోయిన్ల కెరీర్ మాత్రం నిస్తేజంగా, నీరసంగా సాగుతున్నాయి. బాహుబలి తో పాన్ ఇండియా ఫేం సాధించిన అనుష్క తర్వాత సినిమాలకి దూరమైపోయింది. ఈ మధ్య మిస్ పొలిశెట్టి చేసింది. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. అది తప్పితే జేజమ్మ ఖాతాలో మరో సినిమా లేదు.
కీర్తి సురేష్ చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. దసరా తర్వాత మరో తెలుగు సినిమా ఆమె వద్దకు వెళ్ళలేదు. తమిళంలో మాత్రం ఒకట్రెండు సినిమాలతో బిజీగా ఉంది. సమంత పరిస్థితి కూడా ఇదే. ఎదో ఓ హాలీవుడ్ సినిమా తప్పితే సమంత ఖాతాలో చెప్పుకోవడానికి మరో సినిమా లేదు. `పుష్ష 2`లో సమంత కనిపిస్తోందన్న రూమర్లు వినిపిస్తున్నాయి. వాటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలీదు. పూజా హెగ్డే పరిస్థితి మరీ విచిత్రంగా వుంది. అల వైకుంఠపురం తర్వాత ఆమె కెరీర్ రాకెట్ లా దూసుకుపొతుందని భావిస్తే అందుకు భిన్నంగా జరిగింది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాలకే దూరమైయింది. గుంటూరుకారం నుంచి ఏవో సమస్యలతో తప్పకుంది. తర్వాత మరో సినిమా ఊసే లేదు.
తమన్నా వెబ్ కంటెంట్ కి షిఫ్ట్ అయిపొయింది. ఓదెల 2 అనే ఓ లేడి ఒరింయంటెడ్ సినిమా తప్పితే మరో సినిమా ఆమె ఖాతాలో లేదు. రష్మిక మందనకి పుష్ప తర్వాత మరో పెద్ద ప్రాజెక్ట్ లేదు. `రెయిన్ బో` అనే సినిమా చేస్తోంది కానీ, అది లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్,. అందులో రష్మిక మినహాయిస్తే, స్టార్స్ ఎవరూ లేరు. రకుల్ ప్రీత్ సింగ్ కు ఇంతకుముందే సినిమాలు తగ్గిపోయాయి. ఇప్పుడు పెళ్లితో వైవాహిక జీవితంలో బిజీ అయిపోయింది. ఆ రకంగా రకుల్ కూడా ఖాళీ. సాయి పల్లవి ఖాతాలో ‘తండేల్’ ఒక్కటే కనిపిస్తుంది. గత ఏడాది వరుస పెద్ద సినిమాలతో సందడి చేసిన శ్రుతి హాసన్ జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది. అడివి శేష్ తో చేస్తున్న డకాయిట్ తప్పితే మరో సినిమా కనిపించడం లేదు.
ఇక రెగ్యులర్ గా సినిమాలు చేసిన శ్రీలీల కూడా ఒక్కసారిగా డల్ అయిపోయింది. చేతిలో వున్న సినిమాలు దాదాపుగా అయిపోయాయి. కొత్త సినిమాలకి సైన్ చేసిన దాఖలాలు లేవు. ఆమె సక్సెస్ రేటు కూడా ఇందుకు ఓ కారణం అని చెప్పొచ్చు. ఫ్యామిలీ స్టార్ తర్వాత మరో తెలుగు సినిమా మృణాల్ ఖాతాలో లేదు. మొత్తానికి ఒకేసారి నాలుగైదు సినిమాలతో సందడి చేసే కథానాయికల డైరీలు ఇలా ఖాళీగా కనిపించడం కాస్త వింతగానే వుంది. హిట్లు లేకపోవడం, కొత్త కథానాయికలవైపు దర్శకులు దృష్టి సారించడం ఈ స్టార్ హీరోయిన్ల జోరు తగ్గడానికి ప్రధాన కారణం.