ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు తీసుకు వచ్చారు. దేశంలో… ఇలాంటి ఏర్పాటు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ విషయంలో… యువకుడైన ఆయన ఆలోచనల్ని అందరూ గౌరవించాలి. ఎందుకంటే.. ఆయనకు యాభై శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. 80 శాతానికిపైగా సీట్లు వచ్చాయి. అది ఏకపక్ష విజయం. ప్రజలు ఆయనపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఏం చేసినా ప్రజలు సమర్థిస్తారు. వాటి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అమరావతే రాజధానిగా ఉండాలని.. అందులో ప్రజాధనం రూ. పదివేల కోట్లు ఖర్చుచేశారని ఎంత అరచినా ప్రయోజనం లేదు. అంతకు మించి.. మూడు రాజధానుల ద్వారా ప్రజల సంపదను పెంచుతారనే ఆశ ప్రజల్లో ఉంది. ఆ ఆశయం జగన్‌కూ ఉంది.
ఇక విశాఖ… ముంబై, ఢిల్లీ, బెంగుళూరు స్థాయికి ..!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎవరూ చేయని ఆలోచన మూడు రాజధానులు. రాష్ట్రం విడిపోకపోతే.. అసలు రాజధాని.. మూడు రాజధానులు అనే కాన్సెప్టే వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా.. హైదరాబాద్‌కు ధీటుగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ నగరాన్ని అభివృద్ధి చేయాలని.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా డిమాండ్ చేయలేదు. రాజధాని కావాలని అడగలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాజధాని ఏపీకి లేకపోవడంతోనే సమస్య వచ్చింది. చంద్రబాబు అమరావతిని కట్టాలనుకున్నారు. ఐదేళ్ల సమయంలో కట్టగలిగినంత కట్టాడు. కానీ అది సరిపోలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పీకిపాకాన పెట్టడానికి.. పెద్దగా సమయం పట్టలేదు. గొప్ప సంపద సృష్టిస్తానని ఆయన చెప్పి ఉండవచ్చు కానీ.. జగన్ అంతకు మించి.. సృష్టిస్తానని చెబుతున్నారు. అమరావతిపై పెట్టే పెట్టుబడిలో పది శాతం.. విశాఖలో పెట్టి.. ముంబై, ఢిల్లీ, బెంగుళూరులా.., సాగర నగరాన్ని తీర్చిదిద్దుతానని అంటున్నారు. చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు అంతకన్నా.. కావాల్సిందేముంటుంది.
అమరావతి రైతులకు చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు..!ఇక అన్యాయం ఎక్కడ..?
పధ్నాలుగు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి… ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టకపోయి ఉండవచ్చు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులనూ పరుగులు పెట్టించలేకపోవచ్చు. ఓ లక్ష కోట్లు అప్పులు చేసి ఉండవచ్చు. అంత మాత్రాన మూడు రాజధానులు పెట్టకూడదని ఎక్కడా లేదు. ఆయనకు నిర్ణయం తీసుకునే అధికారాన్ని.. అదీ కూడా.. ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని ప్రజలు ఇచ్చారు. ప్రతిపక్షానికి కనీసం వాయిస్ కూడా లేదు. ఇలాంటి సమయంలో.. అందరూ జగన్‌పై నమ్మకం పెట్టుకోవాలి తప్ప.. వ్యతిరేకించడం వల్ల ఉపయోగడం ఉండదు. ఇప్పుడు అందరూ రాజధాని రైతుల గురించి మాట్లాడుతున్నారు. రాజధాని రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమదేనని ప్రభుత్వం కూడా చెబుతోంది. ఒక వేళ వారికి ప్రభుత్వం వల్ల న్యాయం జరగకపోతే… ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసినందున.. ఓ లక్షన్నర కోట్ల వరకూ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. కావాలంటే కాస్త అప్పు చేసి.. రైతులకు పరిహారం చెల్లించేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఇక రైతులకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది..?
విశాఖ సీమకు దూరమని కోస్తా వాసుల సన్నాయి నొక్కులా..?
ఇక చాలా మంది.. రాయలసీమకు….ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ దూరమవుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలా అంటున్న వారిలో కోస్తా వాసులే కానీ.. రాయలసీమ వాసులు లేరు. రాయలసీమ వాసులు హ్యాపీగానే ఉన్నారు. వారికి కర్నూలులో హైకోర్టు వస్తుంది. కర్నూలులో హైకోర్టు పెట్టడానికి ఏపీ సర్కార్‌కు చట్టం చేసే అధికారం ఉందా లేదా.. అన్నది తర్వాత సంగతి. కానీ.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో.. సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా లాభపడేందుకు కావాల్సిన సహకారం అందిస్తోంది. కేంద్రం తల్చుకుంటే.. పెట్టేయగలదు కూడా. కర్నూలులో న్యాయరాజధాని పెడితే.. రాయలసీమకు రాజధాని లుక్ వచ్చేస్తుంది. మెట్రో సిటీలూ అభివృద్ధి చెందుతాయి. కర్నూలు హైకోర్టును ఆనుకునే కడప, తిరుపతి, అనంతపురం ఉంటాయి కాబట్టి.. అవీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఎవరూ చింతించాల్సిన పని లేదు.
చంద్రబాబు చేయలేనిది జగన్ చేసి చూపిస్తారు.. లేకపోతే ప్రజలే తీర్పు చెబుతారు..!
జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు కానీ.. మూడు రాజధానులను మాత్రం అమల్లోకి తీసుకొచ్చేశారు. రేపు కోర్టులు కొట్టి వేసినా ఆయన వెనక్కి తగ్గరు. ఆయనకు.. మూడు రాజధానుల్ని అభివృద్ధి చేసే బాధ్యత ఇవ్వాలి. ఇప్పటికే 14నెలలు గడిచిపోయాయి. కొత్తగా లక్షన్నర కోట్ల అప్పు వచ్చింది. ఇంకెంత అప్పు చేస్తారో.. అంతకు మించి సంపదను.. మూడు రాజధానుల ద్వారా సృష్టించే అవకాశాన్ని కల్పించాలి. మరో మూడేళ్ల పది నెలల కాలంలో.. చంద్రబాబు చేయలేని దానిని జగన్ చేసి చూపిస్తారు. లేకపోతే.. ఆ తర్వాత ప్రజలే తీర్పు ఇస్తారు.