పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు కావాల్సిన వారికి బిల్లులు మంజూరు చేసుకునే హడావుడిలో ఉంది. అప్పులు చేసి.. ఆ పని పూర్తి చేస్తోంది. కానీ బటన్ నొక్కిన పథకాలకూ డబ్బులు విడుదల చేయడం లేదు. పధ్నాలుగు వేలకోట్లు ఎన్నికలకు ముందు ఖాతాల్లో వేస్తామని హడావుడి చేశారు. ఎన్నికలయ్యాక పధ్నాలుగు వందల కోట్లు కూడా జమ చేయలేదు. కానీ అప్పులు మాత్రం దాదాపుగా పది వేలకోట్ల వరకూ చేశారు.
తాజాగా తమకు పదిహేను వందల కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉందని ఆరోగ్య శ్రీ ఆస్పత్రులు వైద్యం ఆపేస్తామని చెబుతున్నాయి. ఓటు దాటాక బోడి మల్లన్నలు అని ఓటర్లనే పక్కన పడేసిన ఏపీలోని వైసీపీ సర్కార్ కు ఇక ఆస్పత్రులు కనిపించడం అసాధ్యం. అయితే ఆస్పత్రులకు ప్రస్తుత రాజకీయం గురించి తెలిసి కూడా ఎందుకు అల్టిమేటం ఇచ్చాయన్నదే కీలకం.
ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఆస్పత్రులు బిల్లులు, ప్యాకేజీల రేట్ల పెంపు కోసం ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు బెదిరిస్తూంటే సైలెంట్ అయిపోయారు. ఈ ప్రభుత్వంలో పైసా రాదని డిసైడయ్యారేమో కానీ.. ఎన్నికలయ్యే వరకూ మారు మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి ఫలితాలు రాగానే బిల్లుల పాట ప్రారంభించారు. కౌంటింగ్ అయిన తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పాత బిల్లుల బకాయిలు ఇస్తుందో లేదో కూడా చెప్పడం కష్టమే.