ఏపీ అసెంబ్లీ బడ్దెట్ సమావేశాలు కూడా ఫిబ్రవరిలోనే జరగనున్నట్లుగా తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ముందు వారం రోజులు చాలా బిజీగా ఉంటారు..కాబట్టి బడ్జెట్ వంటి కీలక సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత వెంటనే మరో జీ20 సన్నాహాక సదస్సు విశాఖలోనే జరగాల్సి ఉంది. ఇది కేంద్రం నిర్వహిస్తున్నప్పటికీ.. ఏపీలో జరుగుతోంది కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిందే. అంటే మార్చిలో రెండు అంతర్జాతీయ సదస్సులు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ మధ్యలో నిర్వహించడం కష్టం.
ఈ కారణం చూపించి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి లోనే ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ కు ఇలాంటి అంతర్జాతీయ సదస్సుల పనులు లేకపోయినా ఫిబ్రవరి మూడో తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు. బడ్జెట్ కూడా వెంటనే పెట్టేస్తారు. తెలంగాణ సర్కార్ ముందస్తుకు వెళ్లబోతోందని అందుకే అన్ని పనులు పూర్తి చేసుకుంటోందని అక్కడి రాజకీయవర్గాలు నమ్ముతున్నాయి. బీఆర్ఎస్ వర్గాలూ దీన్ని ఖండించడం లేదు.
అయితే ఏపీ సర్కార్ కు అంత అవసరం ఏముందనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. కేసీఆర్, జగన్ మొదటి నుంచి ఓ రాజకీయ అవగాహనతో ఉన్నారని.. కలిసే ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయం కొంత కాలంగా వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ బీజేపీపై యుద్ధం చేస్తూండగా… వైసీపీ మాత్రం అనధికార మిత్రపక్షంగా ఉంది. జగన్ .. ముందస్తు కోసం.. కేంద్రం అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకంటే కేంద్రం సహకరించకపోవచ్చని.. జగన్ కూడా ముందుకు వస్తే…. కేంద్రం అంగీకరించే చాన్స్ ఉందని అనుకున్నారు.
ఇప్పుడు వేర్వేరు కారణాలు అయినా… బడ్జెట్ ను ఫిబ్రవరిలోనే పెట్టబోతున్నారంటే… కలసే అసెంబ్లీలను రద్దు చేయడం.. ఎన్నికలకు వెళ్లడం చేయబోతున్నారన్న నమ్మకం ఎక్కువ మందిలో బలపడుతోంది.