ఏపీ బీజేపీ నేతలు అనని మాటల్ని కూడా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ర్యాలీల్లో దుర్ఘటనలపై ఏపీ బీజేపీ నేతలు వైసీపీ తరహాలో శవరాజకీయం చేయలేదు. అలాంటి ఘటనలు తమ వెనుక చాలా ఉన్నాయని వారికీ తెలుసు కాబట్టి.. అత్యుత్సాహం చూపించలేదు. ఇటీవలే గుజరాత్లో జరిగిన వంతెన ప్రమాదఘటన దగ్గర్నుంచి చెప్పుకోవాల్సినవి చాలా ఉంటాయి. అయితే ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కూడా అనని మాటల్ని అతి సులువుగా రాసేస్తోంది. చంద్రబాబును వ్యక్తిగంతగా తూలనాడుతూ పోస్టులు పెడుతున్నారు.
చంద్రబాబునాయుడుపై మంత్రుల ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి ఒక్క సారిగా పోస్టులు వెల్లువెత్తాయి. చంద్రబాబును అన్ని రకాలుగా విమర్శిస్తూ .. ఏక వచనంతో నిందిస్తూ ఆ ట్వీట్లు ఉన్నాయి. మంత్రులు .. పదవులు పొందిన వారి ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ ఐ ప్యాక్ చేతుల్లో ఉంటాయి కాబట్టి అందరూ సరే అనుకున్నారు.. కానీ ఏపీ బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా అదే తరహా ట్వీట్ రావడంతో ఆ పార్టీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోయారు. బయట అనని మాటల్ని సోషల్ మీడియాలో ఎందుకు అంటున్నారనేది వారికి అర్థం కాలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియా బాధ్యతల్ని సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డికి అప్పగించారు. ఆయన చార్జ్ తీసుకున్నారో లేదో కానీ.. కొన్నాళ్ల నుంచి ఏపీ బీజేపీ సోషల్ మీడియా హ్యాండిళ్లు.. జగన్ పై అభిమానం.. చంద్రబాబుపై ద్వేషం చూపిస్తున్నాయి. దీన్ని ఆయన సరిదిద్దుకుని… కనీసం తమ పార్టీ స్టాండ్ ప్రకారం అయినా పోస్టులు ఉండేలా చూసుకుంటారేమో చూడాల్సి ఉంది.