ఆంధ్రప్రేదశ్ బీజేపీ నేతలు ఏం చేసినా వారిపై వైసీపీ ముద్ర పోవడం లేదు. దానికి కేంద్రం కొంత కారణం అయినా ఎక్కువగా రాష్ట్ర నేతల తీరు వల్లే ఈ సమస్య వస్తోంది. సోము వీర్రాజు లాంటి నేతలు వైసీపీపై ఎంత ఘాటు విమర్శలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అదంతా… జగన్ పై అభిమానంతో చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో హైకమాండ్ నుంచి ఒత్తిడి పెరగడంతో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు. స్ట్రీట్ మీటింగ్లు నిర్వహించారు.
ఇప్పుడు రాజకీయ పర్యటనకు అమిత్ షా కూడా వస్తూండటంతో కొత్తగా పాదయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు. పదమూడు వేల గ్రామాల్లో పాదయాత్రలు చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ పాదయాత్రల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆయన వాదన. ఆయన మాటలను..బీజేపీ నేతలు కూడా పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. ఏ కార్యక్రమం జరిగినా ముందుగా టీడీపీని విమర్శించడం.. ఆ తర్వాత వైసీపీని పైపైన విమర్శించడం కామన్. ఇప్పుడు కూడా అంతకు మించి చేస్తారని అనుకోవడం లేదు.
ఓ వైపు ఏపీ బీజేపీ నేతలు సీరియస్ గా ఏ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం చేద్దామనుకున్నా… జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా మెలికి గాలి తీసేస్తూంటారు. ఇక్కడ రాష్ట్ర నేతలు అధికార పార్టీ నేతలతో కలిసి పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఈ కారణాలతో ఏపీ బీజేపీ ఏ మాత్రం బలపడటం లేదు. అయినా.. ఢిల్లీ పెద్దలు చెప్పారని.. వారిని మాయ చే్యడానికి భారీ కార్యక్రమాలు ప్రకటిస్తూనే ఉంటారు.