ప్రభుత్వంపై విపక్షం ఏ అంశంపై పోరాడుతుందో.. ఆ అంశంపై కేసులు పెట్టడం ప్రారంభించింది. గత ప్రభుత్వం ఇసుక విధానం ద్వారా భారీ నష్టం చేకూర్చిందంటూ.. తాజాగా కేసు నమోదు చేశారు. ఇందులో ఏ వన్ గా పీతల సుజాత, ఏ టుగా చంద్రబాబు.. తర్వాత చింతమనేని, దేవినేని ఉమ వంటి పేర్లు పెట్టారు. ఇక ఏమీ తెలియనట్లుగా ఎప్పట్లాగే కొంత మంది గుర్తు తెలియని అధికారులని కాకమ్మ కబుర్లు చెప్పారు. గనుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారని సీఐడీ కేసు నమోదు చేసింది.
ఇందులో ప్రభుత్వానికి నష్టం కలిగించారని పేర్కొన్నారు. కేసులు, చట్టాలు అంటే.. ఏపీలో ఓ ఆట వస్తువుగా మారిపోయాయి. ఏ ఆధారాల్లేకుండా.. కనీసం బేసిక్స్ కూడా లేకుండా.. కేసులు పెట్టేయడం.. అనుకున్న వారిని అరెస్టు చేయడం కామన్ గా మరిపోయింది. స్కిల్ కేసు పేరుతో హడావుడి చేసి.. పది పైసల అవినీతిని నిరూపించలేకపోయారు. తాము ఎవర్ని టార్గెట్ చేస్తే వారి పేర్లే పెట్టేసి..ఏవో కొన్ని వేల కోట్ల నష్టం జరిగిందని.. దారి మళ్లించేశారని.. కాకమ్మ కబుర్లతో ఎఫ్ఐఆర్లు నింపేస్తున్నారు. తాజాగా ఇసుక కేసుపైనా అలాగే కేసు పెట్టారు. మూడు రోజుల కిందట మద్యం కేసు కూడా అలాగే పెట్టారు.
ఇవన్నీ న్యాయస్థానాల్లో నిలుస్తాయా లేదా అన్న సంగతి తర్వాత . నిలువవు అని తెలుసు కూడా . కానీ కేసు పెట్టామా.. అనుకున్న వాళ్లని అరెస్టు చేశామా… మరీ కోపం ఉన్న వాళ్లని హింసించామా.. వాళ్ల ఆరోగ్యం దెబ్బతీసి.. చనిపోయేలా చేశామా లేదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో సోషల్ మీడియా పోస్టులు పెట్టారని ఓ పెద్దాయన్ని అరెస్టు చేసి కర్నూలుకు తరలించారు. ఆయనకు కరోనా వచ్చి చనిపోయారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఓ క్రిమినల్ చేతిలో వ్యవస్థ ఉంటే… ఎంత ఘోరంగా దిగజారిపోతుందో.. తాజా ఉదాహరణ. ఇంకా ఓ పది కేసులు పెట్టినా పెట్టవచ్చు. ఎందులోనూ మనీ ట్రయల్ ఉండదు. కేవలం ఆరోపణలు ఉంటాయి. చట్టం ఎంత చులకన అయిపోయింది అని .. ఇతరులు అనుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏపీలో ఉండిపోయింది.