టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అని సీఎం జగన్ నర్సాపురంలో అర్థం చెప్పారు. వారు ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతున్నారని ప్రజలకు ఫిర్యాదు చేశారు. జగన్ మాటలు విన్న ఎవరికైనా.. మీ బూతులతో పోలిస్తే.. వాళ్ల బూతులు కూడా బూతులేనా ? అని అనుకోవడం సహజం. ఎందుకంటే వైసీపీ నేతల బూతులు.. అంతర్జాతీయ స్థాయికి వెళ్లాయి. వాళ్ల భాషా పరిజ్ఞానాన్ని ప్రజలందరూ విన్నారు. పైగా.. అలా తిట్టిన వాళ్లకు గుర్తింపుగా పదవులు ఇచ్చిన రికార్డు కూడా కళ్ల ముందు కనిపిస్తోంది. అయినా.. తమది కాదు.. ఎదుటి పార్టీదే బూతుల పార్టీ అని చెప్పేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
తెలుగు రాజకీయాల్లో గత మూడున్నరేళ్లుగా ఎవరూ ఊహించనంత దుర్గంధమైన భాషా ప్రవాహం సాగుతోంది. అధికారంలో ఉన్నామని వైసీపీ నేతుల చెలరేగిపోయారు. పుట్టుకలను ప్రశ్నించడం దగ్గర్నుంచి అక్రమ సంబంధాలను అంటగట్టడం వరకూ అన్నీ చేశారు. ఇంకా చేస్తున్నారు. ఇప్పటికీ విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తూంటే.. అసలు వీళ్లు మనుషులేనా.. అని ఎవరికైనా అనుమానం రాకుండా ఉండదు. అలాంటి ట్రాక్ రికార్డు పెట్టుకుని బూతుల పార్టీ ఏదో చర్చ పెట్టాలన్నట్లుగా సీఎం జగన్ ప్రసంగించడం వైసీపీ వర్గాలను కూడా ఆశ్చర్య పరిచింది.
అంతే కాదు జనసేన పార్టీని రౌడీ పార్టీ అంటూ చెప్పుకొచ్చారు.. జగన్. అసలు రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు అడుగడగునా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వైసీపీ నేతలు.. చేస్తున్న దాడులు.. హత్యయత్నాలు.. కళ్లముందు కనిపిస్తున్నాయి. ఆస్తులు దోచుకున్నా వారిపై కేసులు ఉండటం లేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీని రౌడీ పార్టీ అనేశారు జగన్. అసలు రౌడీ పార్టీ ఏదో చర్చ జరిగితే… ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది.