ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఇబ్బందులు పడుతున్న వారి జాబితాలో.. నిన్నటిదాకా అధికారులే ఉండేవారు.. ఇప్పుడు.. గవర్నర్, మాజీ న్యాయమూర్తులు కూడా ఆ జాబితాలో చేరినట్లయింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో.. ఆర్డినెన్స్ ఇచ్చిన గవర్నర్.. ప్రభుత్వం పిలిచి పదవి ఇవ్వగానే.. నిబంధనలు తెలిసి కూడా వచ్చేసి పదవి తీసుకున్న మాజీ న్యాయమూర్తి కనగరాజ్‌పై విమర్శలు వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆర్డినెన్స్ ఇచ్చిన గవర్నర్‌ను విపక్షాలు ప్రశ్నించవా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అధికారులు ఇబ్బంది పడుతున్నారు. కోర్టు తీర్పులు పాటించకుండా… ధిక్కరణ తరహా ఆదేశాలు జారీ చేస్తూండటంతో కోర్టు సైతం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటికి నిన్న రంగుల జీవో విషయంలో సీఎస్ నీలం సహాని. పంచాయతీరాజ్ సెక్రటరీ ద్వివేదీ , కమిషనర్ గిరిజా శంకర్ కోర్టుకు హాజరై క్షమించాలని కోరారు. ఇప్పుడు తాజాగా.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపు వ్యవహారంలో… ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టి వేయడం.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్పైనా విమర్శలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో అత్యంత కీలకమైన అంశం ఇదే. గవర్నర్ రాజ్యాంగాధిపతి. రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. కానీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… ఎస్ఈసీగా ఉన్న రమేష్‌కుమార్ ను తొలగించడానికి.. కొత్త ఎస్ఈసీగా కనగరాజ్‌ను నియమించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి అలా ఫైల్ రాగానే ఇలా సంతకం పెట్టేశారు.
న్యాయ, రాజ్యాంగ సలహాలు తీసుకోకుండా సంతకం పెట్టేసిన గవర్నర్..!
సాధారణంగా ఇలాంటి వివాదాస్పద విషయాల్లో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటారు.. లేదా… రాజ్యాంగ నిపుణుల సలహా తీసుకుంటారు. కానీ.. గవర్నర్ ఎస్ఈసీ మార్పు కోసం… ఎలాంటి సలహాలు.. తీసుకోకుండా.. చాలా తక్కువ సమయంలోనే సంతకం చేసేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆయనపైనా విమర్శలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ అయిన హరిచందన్… రాజ్యాంగాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు విపక్షాలు చేస్తాయి. రాజ్యాంగ నిబంధనలు పట్టించుకోకుండా నియామకానికి ఆమోదం తెలిపారని.. తక్షణం ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేసి.. రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడాలన్న డిమాండ్లు సహజంగానే విపక్ష రాజకీయ పార్టీల నుంచి వస్తాయి. హైకోర్టు కూడా ఆర్టికల్ 213 ప్రకారం.. ఆర్డినెన్స్ చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇది కీలకం కానుంది.
మాజీ న్యాయమూర్తి కనగరాజ్‌పైనా విమర్శలకు అవకాశం..!
మరో వైపు హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కనగరాజ్.. ఏపీ సర్కార్ పదవి ఆఫర్ చేయగానే… అన్నీ తెలిసి కూడా వచ్చి పదవిని తీసుకున్నారు. అప్పుడే ఆయనపై విమర్శలు వచ్చాయి. అంత పెద్ద మనిషి.. న్యాయమూర్తిగా చేసిన వ్యక్తికి రాజ్యాంగం తెలియదా..? అనే ప్రశ్నలు వినిపించాయి. ఇప్పుడు మరింతగా విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.. ఇప్పుడూ గవర్నర్‌కూ తప్పలేదని..మాజీ న్యాయమూర్తికీ మరక అంటించేశారని.. విపక్ష నేతలు ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.