ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. జగన్ అలా ప్రధానమంత్రి నివాసంలోకి వెళ్లే సమయంలోనే .. మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లుగా సమాచారం బయటకు వచ్చింది, దీంతో నరేంద్రమోదీ ఏ మూడ్లో ఉన్నారో కానీ దాదాపుగా అరగంట సేపు సమావేశం జరిగిందని.. తమ విజ్ఞాపనలన్నీ మోదీ విన్నారని.. సానుకూలంగా స్పందించారని.. అటు సీఎం జగన్ తో పాటు ఇటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు.
మరో వైపు మీడియాకు మాత్రం ఎప్పుడూ ఇచ్చే ప్రెస్ నోట్ నే కొన్ని మార్పులు చేసి ఇచ్చారు. అందులో ప్రత్యేకహోదా దగ్గర్నుంచి అన్ని హామీలు అమలు చేయాలని అడిగినట్లుగా ఉంది. నాలుగేళ్ల నుంచి అవే అడుగుతున్నారు.కానీ కేంద్రం పైసా సాయం చేయడం లేదు. ఈ సారి కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేశారన్నారు కానీ.. అసలు లోపల ఏ అంశాలపై అడిగారు.. ఏం చెప్పారు అన్నది మాత్రం సీక్రెట్ గానే ఉంటుంది. మోదీతో భేటీ తర్వాత జగన్..కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రితో భేటీ అయ్యారు. రుషికొండ తవ్వకాలపై కమిటీని ఆ మంత్రిత్వ శాఖనే వేయనుంది. దీంతో ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
ప్రస్తుతం ఏపీ సర్కార్ ఓడీలోనే ఉందని.. సామాజిక పెన్షన్లు మంజూరు చేయడానికి కూడా నిధులకు కటకటగా ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో ఆమెను కలిసే అవకాశం లేదు. అమిత్ షాను రాత్రి పదిగంటల తర్వాత కలవనున్నారు. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పట్లాగే.. అంతుబట్టకుండా సాగుతోంది. అందులో రాష్ట్ర అంశాలు ఉన్నాయో.. లేవో మాత్రం క్లారిటీ లేదు. కానీ సానుకూలత అంటూ.. ప్రచారం మాత్రం ప్రారంభించారు. అయితే జగన్ ఢిల్లీ భేటీపై మీడియాలోనూ పెద్దగా ఆసక్తి వ్యక్తం కాకపోవడం అసలు విశేషం.