ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తోంది. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది.. అయితే హోదాపై ప్రధాని మోడీ మాట తప్పడంతో కాంగ్రెస్కు కొన ఊపిరి లభించినట్టయింది. అందుకే హోదా అస్త్రంగా తిరిగి ఏపీలో అడుగుపెట్టేందుకు కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగానే తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామంటూ రాహుల్ చెబుతూ వస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హోదాభరోసా యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రతో… కాంగ్రెస్కు భరోసా వస్తుందని ఆయన ఆశ.
భరోసా యాత్రలో రాహుల్ పాల్గొంటారు.. 22న తిరుపతిలో జరిగే యాత్రలో పాల్గొంటారు.. హోదా ఇస్తామంటూ మోదీ మాట ఇచ్చి మాట తప్పారో అదే వేదిక అయిన తిరుపతిలో రాహుల్ మరోసారి ప్రకటన చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామంటూ మరోసారి స్పష్టం చేయనున్నారు.. అంతేకాదు భరోసా యాత్రలో పాల్గొన్న తిరుమల వెంకన్నను కూడా రాహుల్ దర్శించుకోబోతున్నారు. రాహుల్ గతంలో ఎప్పుడూ తిరుమల వెంకన్నను సందర్శించుకోలేదు. అయితే మోదీ అధికారంలోకి వచ్చాక రాహుల్ గుళ్ళూ, గోపురాలు తిరుగుతున్నారు. ఉత్తరాదిలో పలు ఆలయాలను దర్శించుకున్న రాహుల్ మొన్నీ మధ్య కర్ణాటక ఎన్నికల సందర్భంలోనూ కొన్ని గుళ్ళకు వెళ్ళారు.. ఇప్పుడు ఇదే తరహాలో తిరుమల వెంకన్నను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. చంద్రగిరివైపు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. సామాన్య భక్తుడిగానే రాహుల్ దర్శనం చేసుకుంటారని, ఇదే సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి కూడా తెలియజేశామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
రాహుల్ రాకతో తిరిగి తమ ఓటు బ్యాంకును కొంతైనా మెరుగుపర్చుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమిలో టీడీపీతో కలిసి కాంగ్రెస్ పని చేస్తోంది.. చంద్రబాబు-రాహుల్ ఇటీవలి కాలంలో చాలాసార్లు భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. వైసీపీ సంప్రదాయ ఓటర్లు అందరూ… కాంగ్రెస్ వారే. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం ఇప్పుడు వైసీపీ వైపు ఉంది. ఓ ఐదారు శాతం ఓట్లను తెచ్చుకున్నా… భవిష్యత్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఆశ పడుతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేకహోదానే.. ఆఖరి అవకాశంగా కనిపిస్తోంది.