ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ ఆధ్వర్యంలో కొందరు ఆరోపణలు ప్రారంభించారు. ఆమె వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ దాచుకుందని అభ్యర్థులకు ఇవ్వలేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఆమె ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదు కానీ.. దీని వెనుక రాజకీయం ఉందన్న అభిప్రాయానికి వస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంది. ఏపీ వంటి రాష్ట్రాలకు పార్టీ ఫండ్ పంపించే పరిస్థితి లేద. కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాలు ఉన్నా.. అవి సాయం చేయాలనుకుంటే.. గెలుపు అవకాశాలు ఉన్న ఇతర రాష్ట్రాల్లో పార్టీ శాఖలకు చేస్తారు. చాన్సే లేని ఏపీ కాంగ్రెస్‌కు చేసే అవకాశం లేదు.
మరి ఎందుకు షర్మిలను టార్గెట్ చేసినట్లు ?
కాంగ్రెస్‌కు షర్మిలా రెడ్డి ఊపిరి పోసే ప్రయత్నం చేశారు. ఆమె సారధ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కొంత ఓటు బ్యాంక్‌ను వెనక్కి తెచ్చుకుంది. రెండు, మూడు స్థానాల్లో గెలుస్తారని వివిధ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడయినప్పటికీ ఏ అభ్యర్థి గెలుపు చాయల వరకూ రాలేదు. కానీ కడప జిల్లాతో పాటు కొన్నిచోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పరాజయానికి కారణం అయ్యారు. వైసీపీ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఎంత బలహీనపపడితే కాంగ్రెస్‌కు అంత ప్లస్ అవుతుంది. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ ఓ కూటమిగా ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూస్తారు. అందుకే కాంగ్రెస్ ను మరింత ఎదగకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే షర్మిలను టార్గెట్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
షర్మిలకు పార్టీఫండ్ ఇచ్చామో లేదో హైకమాండ్ కు తెలుసు కాబట్టి ఆమెపై వస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని… ఎదుగుతునన కాంగ్రెస్ ను నిలిపేసే ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకున్నారు. అందుకే షర్మిలకు మరింత మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.