ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలు పీఆర్సీ విషయంలో చేస్తున్న ఉద్యమంలో భాగంగా మూడో తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి సత్తా చాటుతామని ప్రకటించారు. అయితే ర్యాలీపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. నైట్ కర్ఫ్యూ నిబంధనలు పొడిగిస్తూ నిన్న మధ్యాహ్నమే ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కూడా అనుమతి లేదని ఉద్యోగులు ఎవరూ విజయవాడ రావొద్దని ప్రకటించారు.
మరో వైపు జిల్లాల్లో కలెక్టర్లు రంగంలోకి దిగారు. ఎవరైనా ఉద్యమానికి వెళ్తే గుర్తు పెట్టుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వైపు అనూహ్యంగా ఆ ర్యాలీ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు లేవనెత్తేలా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చల వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే ఆ చర్చల్లో ఒక్క డిమాండ్ పై కూడా సానుకూలంగా చెప్పడం లేదు. ఇప్పటికే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నామని ఇప్పుడు పాత జీతాలు ఇవ్వాలంటే సాధ్యం కాదని.. అలాగే జీవోలు కూడా రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి చలో విజయవాడ ఫెయిల్ చేయడానికి అనేక రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో సమ్మె వద్దని హైకోర్టు కూడా సూచించిందని… ఉద్యోగ సంఘాలు హైనకోర్టు సూచనలను అయినా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఉద్యోగులు మాత్రం సజ్జల వ్యూహాలను రాత్రికి ఆలస్యంగా అర్థం చేసుకున్నారేమో కానీ చలో విజయవాడ నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె కూడా ఖాయమని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.