విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వద్ద పంచాయతీ జరగబోతోంది. ఏపీ ప్రభుత్వం అత్యవసరంగా తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు ఇప్పిస్తే ఇప్పటికి చాలన్నట్లుగా ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులుహాజరవుతారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సంస్థలు.. విద్యుత్ బకాయిల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజనపై ప్రధానంగా పట్టుబట్టాలని ఏపీ అధికారులు భావిస్తున్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, విజయ డెయిరీ లాంటి సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాలు వాదనలను వినిపించనున్నాయి. ముఖ్యంగా సింగరేణి కార్పొరేషన్, దీనికి అనుబంధంగా ఉన్న ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ల విభజన అంశం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలపై ఏపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలంగాణ డిస్కంల నుంచి తమకు రూ.7,500 కోట్లు వస్తాయని ఏపీ అంటోంది. హైకోర్టులో కేసు వేసింది. కానీ తెలంగాణ మాత్రం ఏపీనే తమకు ఇవ్వాలని అంటోంది. మాట్లాడుతూ విభజన చట్టానికి అనుగుణంగా అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. అయితే కేంద్రం కూడా ఇరు రాష్ట్రాల వాదనలు విని.. ఏ నిర్ణయమూ తీసుకోవడంలేదు. ఈ సారి సమావేశంలోనూ అంతే ఉంటుంది కానీ.. ప్రత్యేకంగా ఏ నిర్ణయమూ తీసుకోరని అంచనా వేస్తున్నారు.