సీఎం జగన్ కన్ఫ్యూజ్ అవుతున్నారో జనాలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారో కానీ అదిగో విశాఖకు వెళ్తున్నా.. ఇదిగో విశాఖకు వెళ్తున్నా అని అంటూనే ఉన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుండి ఆయన విశాఖకు అదిగో ఇదిగో అంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మాట. నిన్నటిదాకా ఇక ఉగాది నుంచి అక్కడే అంటూ నీతి మీడియా ముఠాతో చెప్పించారు. కానీ ఇప్పుడు ఆయన మాత్రం మంత్రులకు జూలై అంటూ కొత్త నెల కథ చెప్పారు. దీంతో మంత్రులు కూడా ఇదేం సీరియల్ అనుకోవాల్సి వచ్చింది.
ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కొంత కాలంగా వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదే చెబుతున్నారు. ఉగాది వేడుకల్ని కూడా విశాఖలోనే నిర్వహించాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడే కాదని సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీతో స్పష్టమయిందని మంత్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు.
ప్రస్తుతం మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో ఉంది. అది తేలాల్సి ఉంది. అక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తే.. జీవితంలో ఇక జగన్ మూడు రాజధానులు చేయలేరు. రాజ్యాంగంలో రాజధానులు అనే ప్రస్తావన లేదు కాబట్టి తాను విశాఖ నుంచి పరిపాలన చేస్తానని ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ చట్ట ప్రకారం రాజధానిని మార్చలేరు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ ప్రజల్ని మభ్య పెట్టేందుకు..ఇదిగో విశాఖ.. అదిగో విశాఖ అంటూ కబుర్లు చెబుతున్నారు.
ఇలాంటి మాటలు వినీ వినీ ప్రజలకు విసుగెత్తిపోయింది. అయినా వైసీపీ నాయకులు అధినేతతో సహా కబుర్లు చెబుతూనే ఉన్నారు.