పాత జీతాలు, పీఆర్సీ జీవోల నిలుపుదల, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలనే డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చల గురించి ఆలోచిస్తామన్న ఉద్యోగ సంఘాలు ఇప్పుడు మనసు మార్చుకున్నాయి. లిఖితపూర్వకంగా ఆహ్వానిస్తే వస్తామంటూ ప్రెస్మీట్ పెట్టి ప్రకటించారు. వారు అలా ప్రకటించగానే ప్రభుత్వం నుంచి ఇలా లిఖితపూర్వక ఆహ్వానం అందింది. దీంతో ఉద్యోగులు చర్చలకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ప్రతీ రోజూ ప్రభుత్వం నియమించిన నచ్చచెప్పే కమిటీ రావడం.. కూర్చుని వెళ్లడం కామన్ అయిపోయాయి. ఈ కమిటీలో సభ్యులు అయిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్క సారి కూడా సచివాలయంలో కనిపించలేదు. ఇక సీఎస్ సమీర్ శర్మ అటు వైపు కూడా లేదు. మూడు రోజుల పాటు సజ్జలతో పాటు బొత్స, పేర్ని నాని వచ్చారు. సోమవారం ఒక్క బొత్స మాత్రమే వచ్చి ఉద్యోగులపై హెచ్చరికలుజారీ చేసి వెళ్లారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం మధ్య మెల్లగా ఓ అండర్ స్టాండింగ్ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే మూడు డిమాండ్లకు బదులు లిఖితపూర్వక హామీ ఇస్తే చర్చలకు వస్తామని చెప్పారని తెలుస్తోంది .
మూడో తేదీన ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఆ లోపే ఉద్యోగుల్ని కూల్ చేయడమా.. లేకపోతే మరింత గందరగోళానికి గురి చేసి వాళ్ల పోరాటం విషయంలో నెనుకబడేలా చేయడమా అన్న వ్యూహంపై కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సమ్మెకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. కానీ వారి డిమాండ్లను మాత్రం పరిష్కరించే ఆలోచన లేదు. ఇంత జరిగిన తర్వాత వెనక్కి తగ్గితే ఇక ఉద్యోగులకు భవిష్యత్లో ప్రభుత్వం దగ్గర ఎలాంటి విలువా లభించదు. మరి ఉద్యోగ సంఘం నేతలు ఏం చేస్తారో ?