ఏపీ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసుల కఠిన ఆంక్షలు విధించారు. ముందుగానే ఉద్యోగనేతల నిర్బంధం చేశారు. అయితే లక్షల మంది ఉన్న ఉద్యోగులు ఏదో విధంగా విజయవాడ చేరుకుంటున్నారు. చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత జిల్లాల నుంచి ఎవరూ ఉద్యోగులు విజయవాడకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతలకు కలెక్టర్ల ద్వారా హెచ్చరికలు పంపించారు।. ఎవరూ సెలవులు పెట్టవద్దని ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.
మరో వైపు అన్ని జిల్లాల నుంచి విజయవాడకు వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు ఎవరైనా ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు ర్యాలీ నిర్వహించాలనుకున్న బీఆర్టీఎస్ రోడ్డులో వందల కొద్దీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చలో విజయవాడ కార్యక్రమంలో ఉద్యోగస్తులతో సంబంధం లేని కొంతమంది బయటి వ్యక్తులు.. అసాంఘిక శక్తులు చొరబడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు 144 సీఆర్పీసీ ప్రొసీడింగ్స్ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
మరో వైపు ఉద్యోగులు కూడా నిర్బంధంతో పోరాటాన్ని ప్రభుత్వం ఆపేది లేదని చెబుతున్నాయి. అందర్నీ అరెస్ట్ చేసినా పది మందితో అయినా సరే చలో విజయవాడ నిర్వహించి తీరుతామని అంటున్నారు. ప్రభుత్వం తమను పదే పదే మోసం చేసిందని .. కరోనా కంటే ఎక్కువగా ప్రభుత్వమే నష్టం చేసిందని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం చర్చల పేరుతో ఉద్యోగులని మరింతగా రెచ్చ గొడుతోంది. ఇంత కాలం అడుగుతున్న డిమాండ్లు పట్టించుకోకుండా ఇప్పుడు వాటి కాలపరిమితి అయిపోయిందని సజ్జల చెప్పుకొచ్చారు.
అటు ఉద్యోగులు.. ఇటు ప్రభుత్వం పట్టు వీడటం లేదు. సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఎవరూ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. సాధారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. కానీ ఇక్కడ రెచ్చగొట్టేలా వ్యూహరించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రెండు వర్గాలు తెగే దాకా లాక్కుంటున్నారన్న విమర్శలు సామాన్యుల నుంచి వస్తున్నాయి.