ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఓ మాట మీద నిలకడగా ఉండే పరిస్థితి లేదు. పొద్దున లేచిన తర్వాత ఏది అనిపిస్తే అది చేయడమే తమ విధానంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. అమరావతి విషయంలో తాజాగా ఏపీ హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేశారు. మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకున్నామని.. అమరావతిలో అభివృద్ధి పనులు కూడా ప్రారంంచామని మరో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. కరకట్ట రోడ్డును విస్తరిస్తున్నామని.. హైకోర్టుకు అదనపు భవనాన్ని నిర్మిస్తున్నామని… ఇలా కొన్ని పనుల జాబితా చెప్పుకొచ్చారు.
అమరావతిలో సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కరంటే ఒక్క పని జరగలేదు. అక్కడ ఉన్న నిర్మాణ సామాగ్రిని.. రోడ్లను కూడా తవ్వేసిన పరిస్థితి ఉంది. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పేందుకు హైకోర్టులోఅఫిడవిట్ దాఖలు చేశారు. నిజానికి ఇది రెండో అఫిడవిట్ . మొదటి అఫిడవిట్లో మూడు రాజధానులు కట్టి తీరుతామని చెప్పారు. ఆ అఫిడవిట్లో ప్రభుత్వం తీరు స్పష్టంగా ఉంది. తాము బిల్లులను సాంకేతికంగా ఉపసంహరించుకున్నాం కానీ మూడు రాజధానులు కడతామని చెప్పారు. నిజానికి అలాంటి విషయాలు హైకోర్టుకు అఫిడవిట్‌గా చెప్పాల్సిన పని లేదు. రాజధాని పిటిషన్లు పరిష్కారం కాకుండా వివాదాస్పదంగా ఉండే ఉద్దేశంతోనే అలా చెప్పారన్న అభిప్రాయాలు వినిపించాయి.
ఇప్పుడు కొత్తగా మళ్లీ రాజధాని కడుతున్నామని అఫిడవిట్లు దాఖలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. కుట్రలలతో.. తప్పుడు దారుల్లో.. తాము అనుకున్నది చేయడానికి ఎంతకైనా తెగించే తాపత్రయంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రభుత్వంపై ఏర్పడుతోంది. చట్టాల ప్రకారం సాధ్యం కాదని తెలిసినా.. అడ్డగోలు పనులు చేస్తూండటం వల్లనే ఇలాంటి పరస్పర విరుద్ధమైన అఫిడవిట్లు దాఖలు చేయాల్సి వస్తోందని న్యాయనిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వానికే అసలు స్పష్టత లేదనేది తాజా అఫిడవిట్‌తో తేలిందన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.