పదవిలో ఉన్న ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన ఏ సంస్థకైనా.. ప్రభుత్వం తరపున లబ్దికలిగించే నిర్ణయాలను తీసుకోరు. నైతికంగా అది కరెక్ట్ కాదని నేతలు భావిస్తూ ఉంటారు. కానీ ఏపీ అధికారులు మాత్రం.. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన కంపెనీకి.. నియమ నిబంధనలతో సంబంధం లేకుండా… జీవితకాలం నీళ్లు.. యాభై ఏళ్ల లీజులు పొడిగించేస్తున్నారు. గుంటూరు జిల్లాలో సరస్వతి పవర్‌కు గనుల లీజును యాభై ఏళ్లకు పొడిగిస్తూ అధికారులు జీవో ఇచ్చారు. సీఎం జగన్‌కు చెందిన కంపెనీ నిర్మాణం ఇంత వరకూ ప్రారంభం కాలేదు. ఏళ్ల తరబడి ఉన్నది ఉన్నట్లుగానే ఉంది కానీ.. ఇప్పుడు మాత్రం.. లీజులను అధికారులు అదే పనిగా మంజూరు చేస్తున్నారు.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో ఆయనకు.. ఆయన భార్య భారతికి దాదాపుగా రూ. నలభై కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. కంపెనీని ఏర్పాటు చేసిన తర్వాతా 2009లో అప్పటి ప్రభుత్వం 1,515.59 ఎకరాల గనుల లీజును మంజూరు చేసింది. అయితే.. పదకొండేళ్లు దాటినా ఆ కంపెనీ నిర్మాణం జరగలేదు. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కోవడంతో ఆగిపోయింది. లీజు నిబంధనలు ఉల్లంఘించారని.. గత ప్రభుత్వం ఆ లీజులను రద్దు చేసింది. అయితే కొత్త ప్రభుత్వ వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపున సానుకూల వాదనలు వినిపించి హైకోర్టులో.. ఆ లీజు విషయంలో అనుకూల తీర్పు పొందారు. ఈ తీర్పు ఫలితంగా.. గనులు మళ్ళీ సరస్వతి పవర్‌కు దక్కాయి. అప్పటి వైఎస్ ప్రభుత్వం గనులు లీజుకు ఇచ్చింది 30 ఏళ్లు మాత్రమే. ఇప్పుడు జగన్ సర్కార్ అధికారులు.. ఆ లీజుల్ని.. యాభై ఏళ్లకు పెంచుతూ జీవో ఇచ్చేశారు. తాజా జీవోతో 2009 నుంచి 50 ఏళ్ళ వరకు అంటే 2059 వరకు ఈ గనులపై కంపెనీకి లీజు హక్కులు దక్కాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని తంగేడ గ్రామం, మాచవరం మండలంలోని వేమవరం, చెన్నయ్యపాళెం గ్రామల్లో ఈ గనులు విస్తరించి ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం.. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు జీవిత కాలం నీటిని వాడుకునే హక్కును కల్పిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిమెంట్ ప్లాంట్ అవసరాల కోసం 5 ఏళ్ళ బదులు జీవితకాలం పాటు కృష్ణా నీరు కావాలంటూ సరస్వతి పవర్ డైరెక్టర్ మార్చి 2న లేఖ రాయగా, సదరు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మే 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ మధ్యలో ఓ సారి ఆదేశాల్లో తప్పులున్నాయని జీవోలను సవరించారు కూడా.