అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని అధికార పార్టీ నిర్ణయించుకుంది. ప్రభుత్వ విధానాలను.. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ వ్యూహాలను ఖరారు చేసే సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారమే ఈ అంశాన్ని చెప్పారు. అయితే ఆయన ఎమ్మెల్యే కాదు కాబట్టి అధికారికం కాదు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా లేఖలు రాయించడం ప్రారంభించారు. సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ అంశంపై సీఎం జగన్కు లేఖ రాశారు. తీర్పుపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు.
చట్టాలు చేయడం అసెంబ్లీ హక్కు అని.. ఆ హక్కును హైకోర్టు తొలగించడం కరెక్ట్ కాదన్నారు. ఇలా చేయడం .. శాసనసభ హక్కులను తగ్గించడమేనని అభిప్రాయపడ్డారు. అసలు న్యాయవ్యవస్థ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ విధులపై చర్చ జరగాలన్నారు. చట్టాలు చేయడం శాసన వ్యవస్థ బాధ్యత అని.. అదిచేయకుండా హైకోర్టు అడ్డుకోవడం సరి కాదన్నారు. ధర్మాన వెలిబుచ్చిన పాయింట్లతో అసెంబ్లీలో ప్రభుత్వం చర్చకు పెట్టడం.. న్యాయవ్యవస్థపై విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది.
రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా హైకోర్టు తాము ఎందుకు ఆ రూలింగ్ ఇస్తున్నామో స్పష్టంగా చెప్పింది. ఓ సారి ఒప్పందం జరిగి పోయిన తరవాత ఇతరుకు నష్టం చేస్తూ ఏకపక్షంగా ఒప్పందం నుంచి బయటకు వెళ్లడం సాధ్యం కాదు. ప్రభుత్వం అలాంటి పని చేస్తూండటం వల్లనే రిట్ ఆఫ్ మాండమస్ ను హైకోర్టు తీర్పులో ప్రకటించింది. ఈ విషయాన్ని పెద్దగా హైలెట్ చేయకుండా కేవలం .. ఆ విషయంలో చట్టంచేయవద్దని ఆదేశించడంపైనే అసెంబ్లీలో చర్చ జరిగేలా ప్రబుత్వం చేసే వ్యూహం పన్నుతోందని భావిస్తున్నారు. ఇదే జరిగితే న్యాయవ్యవస్థతో ప్రభుత్వం మరోసారి నేరుగా ఢీ కొంటున్నట్లుగానే భావించాల్సి వస్తుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.