మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌కే పరిమితం చేసి ఎన్నికలకు వెళ్తాం.. ఇదే మా శపథం అని.. తెగ చాలెంజ్‌లు చేసిన వైసీపీ పెద్దలు ఇప్పుడు .. ప్రజల్ని వెక్కిరిస్తున్నారు. మూడేళ్లకు బార్ లైసెన్స్‌లు ఇస్తామని గెజిట్ రిలీజ్ చేశారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ మూడేళ్లకు బార్ పాలసీ ఇస్తున్నారు. అంటే.. స్టార్ హోటళ్లకే కాదు రొటీన్ బార్లు కూడా ఉంటాయన్నమాట. మరి ఎన్నికలకు వెళ్తారో లేదో తెలియదు కానీ..బార్ల పై మత్రం రూ. కోట్లకు కోట్లు ఫీజులు వసూలు చేసేందుకు రేట్లు ఫిక్స్ చేశారు. ఆశకు హద్దు లేనట్లుగా ఆ రేట్లు ఉన్నాయి.
ఏపీ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం బార్‌కు అప్లయ్ చేసుకోవాలంటే లక్షలు కట్టాల్సిందే. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ పెట్టుకోవాలనుకుంటే ముందుగా రూ. ఐదు లక్షలు పెట్టి అప్లికేషన్ కొనుక్కోవాలి. అలాగే 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ పెట్టుకోవాలంటే అప్లికేషన్ ఖరీదు రూ. ఏడున్నర లక్షలు, 5 లక్షలు అంత కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ పెట్టుకోవాలంటే రూ. పది లక్షల అప్లికేషన్ పీజు కట్టాల్సి ఉంటుంది. తర్వాత బార్ల కోసం వేలం పాట నిర్వహిస్తారు. వేలంలో దక్కినా దక్కకపోయినా బార్ ఈ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వరు. వేలంలో ఎంతకు దక్కించుకుంటే అంత కట్టాల్సిందే. ఏడాదికి పది శాతం పెంచాలి.
త్రీ స్టార్ హోటల్స్‌కు విడిగా ధరలు నిర్ణయించారు. రూ. ఐదు లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు బార్లు పెట్టాలనుకునే అన్ని త్రీ స్టార్ హోటల్స్ కట్టాలి. ఆ పైన జనాభాను బట్టి రూ. 15 నుంచి 50 లక్షలు ఏడాదికోసారి చెల్లించాలి. మొత్తంగా 840 బార్లకు అనుమతి ఇస్తారు. అంటే… ఇప్పుడు ఉన్న బార్లన్నీ ఉంటాయన్నమాట అలాగే ప్రతీ ఏడాది పది శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తారు. ఇటీవల మద్యం బాండ్లపై రూ. ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చుకున్నప్పుడు పాక్షికంగా కూడా మద్య నిషేధం చేయబోమని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు బార్లకు కూడా మూడేళ్ల బార్ పాలసీని ప్రకటించడంతో సీఎం జగన్ మద్య నిషేధ హామీ విషయంలో వెనక్కి తగ్గినట్లే.