ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకూ పేద ప్రజలకు రూ. పది వేల కోట్ల రుణమాఫీ చేస్తూ రూ. పదివేలు, రూ. ఇరవై వేలు మాత్రమే వసూలు చేస్తోంది. అంతే కాదు వారికి లక్షల విలువైన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. రిజిస్ట్రేషన్ తర్వాత వారంతా ధనవంతులైపోతారు. పేదలసంఖ్య తగ్గిపోతుంది. అది వేరే విషయం. మరి పేదలను బాగు చేస్తే మధ్యతరగతి వారిని ఎవరు బాగు చేస్తారు..? అందుకే సీఎం జగన్ ఈ విషయలోనూ క్లారిటీగా ఉన్నారు. మధ్య తరగతి వారికిఓ పథకం రెడీ అయిపోయింది.
పట్టణాల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఇళ్లు కట్టుకున్నా..లేకపోతే ప్లాన్ లేకుండా ఇల్లు కట్టుకున్న వారందరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు పథకం ప్రవేశ పెడుతున్నారు. దీనికి మినిమం ఫీజులు నిర్ణయిస్తారు. భవనాన్ని బట్టి ఆ ఫీజు ఉండే అవకాశం ఉంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదని తెలుస్తోంది. ఓటీఎస్‌కు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అని పెట్టినట్లుగానే దీనికి కూడా… మరో పేరు పెట్టి అమలు చేసే అవకాశం ఉంది. ఏపీలో భారీ పట్టణాలు తక్కువ. ఆ పట్టణాల్లో ఉన్న వారు ప్లాన్లు తీసుకుని నిర్మాణాలు చేసేవారు ఇంకా తక్కువ.
ఎందుకంటే తమ వద్ద అందుబాటులో ఉన్న డబ్బుల్ని బట్టి ఓ సారి శ్లాబ్ ఓ సారి గోడలు కట్టుకుంటారు. ఇక ప్లాన్ల కోసం లక్షలు వెచ్చించే పరిస్థితి ఉండదు. వీరందరికీ ఈ పథకం ఉపయోగపడుతుంది. గృహంపై సంపూర్ణ హక్కు వస్తుంది. ఇప్పటికే అంతర్గతంగా ఈ పథకం ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించి అమలు చేయడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు . ఇది మధ్యతరగతి ప్రజలకు వరం లాంటిది అయ్యే అవకాశం ఉంది. కొన్నిలక్షల కోట్ల ఆస్తి వారి పరం అవుతుంది.