ఏపీలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ చేసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే తవ్వకాలు చేసుకోవచ్చని నేరుగా చెప్పడమన్నమాట. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మనింగ్ కంపెనీకి సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. ఆ విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఓఎంసీ మైనింగ్‌లో చేసిన ఉల్లంఘనలకు లెక్కే లేదు. సరిహద్దులు చెరిపేసి మరీ వేల కోట్ల ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ కేసులు కూడా నమోదుచేశారు. అవన్నీ విచారణలో ఉన్నాయి. ఇప్పుడు వాటి సంగతి తేలకుండానే మళ్లీ తవ్వకాలకు ఏమీ అభ్యంతరం లేదని వైసీపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం ఆసక్తి రేపుతోంది. కేసుల పాలైన తర్వాత .. ఏపీలో ప్రభుత్వాలు మారిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ ఏపీ లో ఆగిపోయింది.
మూడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మైనింగ్ ప్రారంభించేందుకు అవకాశం చిక్కుతోంది. బుధవారం ఈ అంశంపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వం మైనింగ్ పర్మిషన్లు ఇచ్చే అవకాశ ఉంది. ముఖ్యమంత్రి జగన్‌కు.. గాలి జనార్దన్ రెడ్డి ఆత్మీయుడు. అందుకే ఏపీలో మళ్లీ గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ ప్రారంభిస్తే. రాజకీయ వివాదం కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.