ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో ఏపీ తీసుకున్న రూ. పాతిక వేల కోట్ల రుణం విషయంలో కేంద్రం అభిప్రాయం చెప్పాలని హైకోర్టు నోటీసుల ుజారీ చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలనిఆదేశించింది. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకుందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ఇందులో ఈ అప్పు రాజ్యాంగ విరుద్ధమని.. వివరాలు చెప్పాలని కేంద్రం లేఖ రాసిందని కేంద్రంతో పాటు అప్పులిచ్చిన 8 బ్యాంకులు కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు.
అయితే ధర్మాసనం బ్యాంకులకు నోటీసులు ఇవ్వలేదు. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా అప్పు తేవడం రాజ్యాంగంలోని 266(1) అధికరణకు వ్యతిరేకమని కేంద్రం తెలిపిందో లేదో కౌంటర్లో తెలియచేయాల్సి ఉంటుంది. ఒక వేళ నిబధనలకు విరుద్ధంగా ప్రభుత్వం.. రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించి ఈ రుణం తీసుకున్నట్లుగా తేలితే.. ఏపీ ప్రభుత్వం చిక్కుల్లో పడటం ఖాయంగా భావిస్తున్నారు. ఆ రుణాలను మళ్లీ బ్యాంకులకు వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఖర్చు చేసేసిన రూ. పాతిక వేల కోట్లను వెనక్కి ఇవ్వాల్సి రావడం అసాధ్యమని భావిస్తున్నారు. చివరికి ఈ ఏపీఎస్డీసీ రుణం ప్రభుత్వానికి తీర్చుకోలేనిసమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం కరుణించి..కాస్త సానుకూలంగా హైకోర్టుకు నివేదిక ఇస్తే బయటపడతామని ఏపీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.