ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను తామే అమ్మాలని చట్టం చేసుకుంది. ఆన్ లైన్ ద్వారానే తామే అమ్ముతామని .. ధియేటర్లు కూడా అమ్మడానికి లేదని జీవో జారీ చేసింది. అయితే తామే ఓ సంస్థను ఏర్పాటు చేయడం ఇష్టం లేక ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్థను ఎంపిక చేసేందుకు టెండర్లు కూడా పిలించింది. అల్లు అరవింద్ కుమారుడికి చెందిన సంస్థ ఎల్ 1 గా నిలిచిందని.. కాంట్రాక్ట్ దక్కడం ఖాయమేనని ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా ప్రక్రియ ఆపేశారు. మళ్లీ రెండురోజుల నెలల పాటు ఆ అంశం గురించి మాట్లాడలేదు.
తాజాగా ఆన్ లైన్ టిక్కెటింగ్ గురించి మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే ఉన్న ఆన్ లైన్ టికెటింగ్ బుకింగ్ సంస్థలు కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. ప్రతి టిక్కెట్‌పై ప్రభుత్వానికి రెండు శాతం కమిషన్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాటు మరికొన్ని రూల్స్ ఉన్నాయి. అంతిమంగా ఆన్ లైన్ టిక్కెట్లపై ప్రభుత్వం రెండు శాతం కమిషన్ పొందడమే లక్ష్యమన్నట్లుగా జీవో ఉంది. ధియేటర్ల వద్ద టిక్కెట్లు అమ్మరాదని ప్రభుత్వం చెబుతోంది.
ధియేటర్ల వద్ద టిక్కెట్లు అమ్మినా ఆన్ లైన్ పద్దతిలోనే అమ్మాల్సి ఉంటుంది. అంటే.. టిక్కెటింగ్ ఏజన్సీ ద్వారా టిక్కెట్లు అమ్మాలి. అలా చేయడం వల్ల గెట్ వే చార్జీలు… అదనంగా ప్రభుత్వ కమిషన్ అన్నీ కలిపి ప్రేక్షకుడే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఆన్ లైన్ టిక్కెటింగ్ ఫ్లాట్ ఫాం ఓపెన్ చేసి.. సర్వీస్ అందించి రెండు శాతం కమిషన్ తీసుకోవడం వేరు. బుక్ మై షో లాంటి ఇతర పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసినా ప్రభుత్వానికి రెండు శాతం కమీషన్ చెల్లించాలని నిబంధన పెట్టడం విచిత్రంగా ఉంది. అంటే ఏపీలో ఏ సినిమా టిక్కెట్ కొన్నా అందులో రెండు శాతం ప్రభుత్వానికి చెల్లించాలన్నమాట.