ఏపీ ప్రభుత్వం స్మార్ట్ టౌన్ షిప్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నేటి నుంచి ప్రారంభిస్తోంది. మూడు చోట్ల ప్లాట్ల అమ్మకాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అయితే ఆయన క్షేత్ర స్థాయిలో ప్రారంభించడం లేదు. ఎందుకంటే ఎక్కడా ప్లాట్లు రెడీకాలేదు. కొన్ని చోట్ల స్థలాలను రెడీ చేశారు. ఎక్కడా మార్కింగ్ చేయలేదు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కానీ ప్లాట్లను అమ్మకానికి మాత్రం పెట్టేశారు. ఇందు కోసం హాఫ్ పేజీ పేపర్ యాడ్స్ కూడా ఇచ్చేశారు. ఇందులో రియల్ ఎస్టేట్ కపెనీలు వేసే బ్రోచర్లలో ఎలా అయితే ముఖ ద్వరాన్ని గ్రాఫికల్‌గా ఆకర్షణీయంగా వేసి చూపిస్తారో అచ్చంగా అంతే ఓ గ్రాఫిక్ వేశారు.
పేద, మధ్య తరగతి ప్రజల కోసమని.. ఈ పథకాన్ని తెచ్చినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే దీని ధర తక్కువేం ఉండటం లేదు. గజానికి దాదాపుగా రూ. ఇరవై వేలు వరకూ వసూలు చేస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ కంపెనీలు వసూలు చేసినట్లే హిడెన్ చార్జీలు ఉంటాయి. ఇంకా విశేషం ఏమిటంటే..ఏడాది తర్వాత స్థలాలు అప్పగిస్తారట. ఇప్పుడు మాత్రం డబ్బులు కట్టుకుంటూ వెళ్లాలి. ఏడాది చివరికి మొత్తం కట్టేస్తే అప్పుడు ప్లాట్ అప్పగిస్తారు. ఏదైనా అపార్టుమెంట్ తరహా నిర్మాణాలు ప్రారంభించేటప్పుడు ఇలా అడగవచ్చు కానీ.. స్థలాలను కూడా ఏడాదిలో రెడీచేసి ఇస్తామని డబ్బులు ఇప్పుడు కట్టాలని అడగడమే చాలా మందికి విచిత్రంగా ఉంది.
ప్రభుత్వం ప్రతి పనికి.. పేద, మధ్యతరగతివారిని కారణంగా చూపిస్తున్నట్లుగానే ఈ పథకానికీ వారినే చూపిస్తున్నారు. వారికి సొంత ఇంటి యోగం కల్పించడానికే ఈ పథకం అని చెబుతున్నారు. అయితే ఇలాంటి చోట స్థలాలు కొనుగోలు చేయాలంటే ప్రజల్లో ముందు నమ్మకం ఉండాలి. ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే ఎవరూ ముందుకు రారు. ఏదో ఓ నిబంధన ఉల్లంఘించి ఆ వ్యవహారాలు కోర్టుల్లో పడేలా చేస్తే మొదటికే మోసంవస్తుంది. అమ్మకాలను ముఖ్యమంత్రి జగన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. కొనుక్కునే వాళ్లు కూడా వెబ్ సైట్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలి.
గత ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ పేరుతో ఓప్రాజెక్టును చేపట్టింది. సీఆర్డీఏ చేపట్టదల్చిన ఆ ప్రాజెక్టుకు బుకింగ్స్ ఇలా ఓపెన్ చేయగానే అలా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. విదేశాల నుంచి వచ్చి కూడా పెద్ద ఎత్తున ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటి సంగతి ఎటూ తేలలేదు. డబ్బులు కట్టిన వారు టెన్షన్ పడుతున్నారు. వారి బాధలు చూసిన వారెవరైనా మరోసారి ప్రభుత్వంతో పెట్టుకుంటారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.