ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విలువలతో రాజకీయం చేసిన దిగ్గజ నేతగా పేరు పొందిన రోశయ్యకు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో సంతాపం తెలియచేయకపోవడం వివాదాస్పదమవుతోంది. దీనిపై ఆర్యవైశ్య సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. ఇప్పటికైనా రోశయ్యకు అసెంబ్లీలో సంతాపం చెప్పాలని అంటున్నాయి. అయితే ఆయనకు అసెంబ్లీలో సంతాప తీర్మానం చేయడం వల్ల ప్రత్యేకంగా వచ్చే గౌరవం ఏమీ లేదు. అలా చేయకపోవడం వల్ల పాలకుల మనస్థత్వమే మరింత ఫోకస్ అవుతుంది. పగపడితే కనీసం సంతాపం కూడా చెప్పకపోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది. ఇదేమి మొదటి సారి కాదు.
భూమా నాగిరెడ్డికి ఏం జరిగిందో గుర్తు లేదా !?
భూమా నాగిరెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయారు. ఆయనకు అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఏం చేశారు ?. విమానం అలస్యం అయిందన్న కారణంగా సంతాప తీర్మానానికి జగన్ హాజరు కాలేదు. అంతే కాదు.. వైసీపీ సభ్యులెవరూ సంతాపం తెలియచేయకుండా బయటకు వచ్చేలా బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు కనీసం పరామర్శించలేదు. సంతాపం కూడా చెప్పలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత భూమా దంపతులు జగన్ వెంట ఉన్నారు. కర్నూలు జిల్లాలోనే హెలికాఫ్టర్ ప్రమాదం జరగడంతో అన్నీ వారే చూసుకున్నారు. చివరికి షర్మిల ప్రచారసభలో పాల్గొని ఇంటికి వెళ్తూ శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత వైసీపీలో విబేధాలు..ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడుతో అఖిలప్రియకు జరిగిన వివాహం ఫెయిల్ కావడం వంటి అంశాలతో విభేదాలు రావడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. అంతే… అప్పట్నుంచి పగ బట్టినట్లుగా వ్యవహరించారు. గత అనుబంధాన్ని మొత్తం మర్చిపోయారు. చనిపోయిన వాళ్లంతా మంచోళ్లే అన్న పెద్దల మాటను కూడా పట్టించుకోకుండా.. కనీసం సంతాపం కూడా తెలియచేయలేదు.
కిడారి సర్వేశ్వరరావును హత్య చేసినప్పుడయితే శాపనార్థాలు కూడా !
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ను మావోయిస్టులు కాల్చి చంపేశారు. ఆయనతో పాటు టీడీపీ నేత సివేరి సోమను హత్య చేశారు. అయితే… ఆయనకు వైసీపీ నేతలెవరూ సంతాపం చెప్పలేదు. సర్వేశ్వరరావుకు సంతాపం చెప్పకుండా.. ఆయనను పరామర్శించడానికి కూడా వైసీపీ నేతలెవరూ ధైర్యం చేయలేకపోయారు. పైగా పార్టీ ఫిరాయించిన వారికి ఇలాంటి గతే పడుతుందని తీవ్ర విమర్శలూ సోషల్ మీడియాలో చేశారు. కొంత మంది నేతలూ మీడియా ముందు చేశారు. పార్టీ అధినేత విధానం ప్రకారమే అలా చేశారు.. అలాంటిది ఇక పార్టీ అధినేత సంతాపం చెబుతారా..?
రోశయ్యకూ అదే ట్రీట్ మెంట్!
అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ క… తమతో విభేదించిన వారిని చనిపోయిన తర్వాత కూడా పగతోనే చూశారు. రోశయ్యను కూడా అదే విధంగా చూశారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోలేదు. తండ్రి వైఎస్‌తో ఉన్నఅనుబంధాన్నీ పట్టించుకోలేదు. తన తండ్రి చనిపోయినతర్వాత సీఎం సీటు తనకివ్వకుండా.., రోశయ్యకు హైకమాండ్ ఇచ్చిందనే ఆగ్రహం జగన్‌కు ఉందని ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో తేలిపోయింది. సీఎంగా ఉన్నరోశయ్యను జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టారో..ఆయన మంత్రివర్గంలో ఉండి.. ఇప్పుడు వైసీపీలో ఉన్న నేతలే కథలు కథలుగా చెబుతారు. అయితే అదంతా రాజకీయం. చనిపోయిన తర్వాత ఓ సంతాప ప్రకటన సీఎంవో నుంచి వచ్చింది కానీ.., వెళ్లి నివాళులు అర్పించడం లాంటివి చేయలేదు. ఇప్పుడు అసెంబ్లీలో సంతాపం కూడా ప్రకటించలేదు. పగబడితే అంతేనన్న ఇతరుల విమర్శలు నిజమేనన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.
నిజానికి ఇప్పుడు రోశయ్యకు అసెంబ్లీలో ఎలాంటి సంతాప తీర్మానం చేయకపోవడమే మంచిది. అడిగి చేయించుకున్నారని.. ఇష్టం లేకపోయినా విమర్శలు వచ్చాయని చేసినట్లవుతుంది. అది రోశయ్యను మరింత అగౌరవపర్చడమే అవుతుంది. ఆయనను స్మరించుకోవడం.. ఆయన సేవలను గుర్తుతెచ్చుకోవడం అసెంబ్లీకి గౌరవం.. ఆయనకిచ్చే గౌరవం.. దాన్ని విపరీత మనస్థత్వం కారణంగా కోల్పోయినట్లయింది.