అతడు సినిమాలో బ్రహ్మాజీని మించిన ప్రణాళికలు వేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి. మహేష్ బాబును కొట్టాడనికి .. ప్రతి వీధి మలుపులో ఓ గ్యాంగ్‌ను పెట్టేందుకు వేసిన ప్రణాళిక తరహాలో…ఓట్లేయించుకునేందుకు ప్రతి యాభై ఇళ్లకు ఓ గ్యాంగ్‌ను రెడీ చేస్తున్నారు జగన్. ఇలా ఒకటి కాదు.. ఒకరిపై ఒకరు.. ఇలా ఒక చోట మిస్సయితే మరో చోట టార్గెట్ చేయాలన్నట్లుగా ఈ ప్లాన్ ఉంది. దానికి తాజాగా ఉదాహరణ.. గృహ సారధుల పేరిట కొత్త సైన్యం.
ఇప్పటికే ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నారు. రెండున్నర లక్షల మంది వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది వైసీపీనే అని ఘనంగా విజయసాయిరెడ్డి ప్రకటించుకున్నారు. అయినా సరే ఇప్పుడు కొత్తగా గృహసారధుల పేరుతో యాభై ఇళ్లకు ఇద్దరు చొప్పున కొత్తగా పార్టీ తరపున నియమించాలని నిర్ణయించారు. జగన్ తీరు చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆయనకు రాజకీయ వ్యవస్థపై సంపూర్ణ అవగాహన ఉందో లేదో కానీ.. ఈ పేరుతో భయ పెట్టి ఓట్లు పొందాలనుకుంటున్నారన్న ఆలోచన ఉందని మాత్రం నమ్ముతున్నారు.
జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభించి మూడున్నరేళ్లు దాటిపోయింది. గత రెండేళ్ల నుంచి ఆయన ఎన్నికల భయంతోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలని తాపత్రాయ పడుతూనే ఉన్నారు . రెండేళ్ల ముందుగానే అందర్నీ ప్రజల్లోకి పంపుతున్నారు. చెప్పిన పనులేమీ చేయకుండా.. ప్రజల్ని అప్పుల పాలు చేసి.. జనాల్ని రోడ్డున పడేసి ఆయన ఏం సాధిస్తున్నారో కానీ.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానేమో అన్న భయంతో ఆయనకు నిద్రపట్టడం లేదు. అందుకే ఒకరిపై ఒకరు.. ఇలా వ్యవస్థల్ని పెట్టుకుంటూ… కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన భయపడుతూ.. ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో అది వర్కవుట్ కాదని ఫలితం తేలిన తరవాతే తెలుస్తుంది.