ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య చిచ్చు రేగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో తమను జేఏసీలో భాగం చేసి.. తమకు వాయిస్ లేకుండా చేసి సమ్మెను విరమించినట్లుగా ప్రకటన చేయించారని నలుగురు ఉద్యోగ సంఘ నేతలపై మండి పడుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఆ నలుగురు కౌంటర్ ఇచ్చారు. తమపై దారుణంగా ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని.. చనిపోయినట్లుగా శవయాత్రలు.. అలాగే మహరాజువయ్యా అనే పాటలు పెట్టి వీడియోలు తయారు చేస్తున్నారని ఉద్యోగ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాము సమ్మె చేయలేదనే ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారని.. వారి వెనుక ఎవరు ఉన్నారని ఉద్యోగ నేతలు ప్రశ్నించారు. ఉపాధ్యాయ నేతల వెనుక వెనుక కొన్ని శక్తులు దాగి ఉండొచ్చని అంటున్నారు. ఈ వాదన నిన్న సీఎం వ్యక్తం చేసిందే. ఉపాధ్యాయుల ముసుగులో రాజకీయశ్రేణులు దాడి చేస్తాయన్న ఆందోళన ఉద్యోగ నేతలు వ్యక్తం చేశారు. ఫిట్‌మెంట్‌పై మంత్రులు స్పష్టంగా చెప్పినప్పుడు నచ్చలేదని ముందే బయటకు వచ్చేయాల్సింది.
కానీ రాలేదని సమ్మె విరమించేందుకు అంగీకరించారని తర్వాత ఫోన్లు రావడంతో వారు వెళ్లిపోయారని ఆరోపించారు. సమ్మె జరగలేదనే ఫ్రస్టేషన్‌తో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలు మీ కార్యాచరణ మీరు తీసుకోండి మాకు అభ్యంతరంలేదన్నారు. ఉద్యోగ సంఘాల నేతల ఇళ్ల వద్ద పోలీసులతో రక్షణ కల్పించారని దాడులకు కుట్ర చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
తమ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ప్రచారం చేయడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఖండించారు. నలుగురు ఉద్యోగ సంఘ నేతలు తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. వారు ఆగ్రహంగా ఉండటంతో ఎపీఎన్జీవో భవన్‌కు.. ఉద్యోగ నేతల ఇళ్లకు పోలీసులు భద్రత కల్పించారు. నిన్నటిదాకా కలసి ఉద్యమం చేసిన రెండు వర్గాలు ఇప్పుడు కలహించుకోవాలని నిర్ణయించుకోవడంతో చిచ్చు పెట్టేశారన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వినిపిస్తోంది.