ఏపీలో కూటమి సర్కార్ గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర జిల్లాలో జరిగిన భూదోపిడీ లెక్క తేల్చే పనిలో పడిందా..? విశాఖను కేంద్రంగా చేసుకొని చెలరేగిపోయిన వైసీపీ నేతల భూబాగోతాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక టీమ్ రంగంలోకి దిగిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
వైసీపీ నేతల అక్రమాలు, అవినీతి వ్యవహారాలు తవ్విన కొద్ది బయటకు వస్తున్నాయని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ లు స్పష్టం చేస్తుండటంతో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతోంది. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రను తన సంస్థానంగా ఏలిన విజయసాయిరెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతల భూదోపిడీ లెక్క తేల్చే పనిలో పడినట్లు తెలుస్తోంది. విశాఖ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో సుమారు 40వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు నాటి ప్రభుత్వ పెద్దల వశమయ్యాయని కూటమి సర్కార్ లో ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా పని చేస్తోన్న ఓ టీం ప్రత్యేకంగా ప్రాథమిక నివేదికలో తేల్చినట్లు తెలుస్తోంది. అమాయకులను బెదిరించి, కేసులు పెడుతామని హెచ్చరించి భూములను లాక్కున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ , ఆయన అనుచరుడు జీవీ వెంకటేశ్వర్ రావు వేల కోట్ల ఆస్తులను , స్థలాలను సంపాదించుకున్నారు. వీరిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇప్పటికే అరెస్ట్ భయంతో ఇద్దరూ పరారయ్యారు. మరోవైపు,మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ కూడా వేల ఎకరాలకు అడ్వాన్స్ లు ఇచ్చి రిజిస్ట్రేషన్ లు చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ ల్యాండ్ లను కొనుగోలు చేసినట్లు ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులూ అందాయి. దీంతో ప్రభుత్వం ఏం చేయనుంది..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సర్కార్ విచారణకు ఆదేశిస్తే విజయసాయిరెడ్డి, ఎంవీ సత్యనారాయణ, జీవీ వెంకటేశ్వర్ రావులకు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.