ఇక అంతా సర్దుకున్నారు. ఇక ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉండదని నిర్ణయించుకున్నారు. తర్వాత ఏం చేయాలా అని ముందే ప్లాన్ చేసుకున్నారు. కానీ వారికి సీఎం జగన్ వారికి అనుకోని వరం ఇచ్చారు. రెండేళ్ల సర్వీస్ పెంచారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు చివరి క్షణంలో విడుదలయ్యాయి. జనవరి 31వ తేదీన రిటైరయ్యే వారికి వరంగా మారింది. కానీ ఉత్తర్వులు రాకపోవడంతో టెన్షన్ పడ్డారు. కానీ చివరి రోజు చివరి క్షణంలో ప్రభుత్వం వారికి ఊరటనిచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమల్లోకి రానున్నాయి. అంటే ఈ నెలలో ఎవరు రిటైర్ కావాల్సి ఉన్నా.. వారి రిటైర్ అవ్వాల్సిన పనిలేదు. మరో రెండేళ్లు ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం సంతకం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించే అవకాశం ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మానవుని సగటు జీవిత కాలం 73 ఏళ్లు పెరిగిందని.. అదే భారతీయుల సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగిందని .. అలాగే సాధారణ ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగైనందున ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతున్నట్లుగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. సీనియర్ ఉద్యోగుల అనుభవముల, నైపుణ్యాన్ని వినియోగించుకునేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ఈ కారణాలు నిజమో కాదో కానీ రిటైరయ్యే ఉద్యోగులకు మాత్రం రెండేళ్లలో భారీ లబ్ది చేకూరనుంది.