పాలనలో ప్రజా శ్రేయస్సు ఉండాలి… పరిపాలన చేస్తుంటే మానవత్వంతో నిర్ణయాలుండాలి… అప్పుడే ఆ ప్రభుత్వాలు ప్రజల మనస్సులో నిలిచిపోతాయి. ఒక రూపాయి ఇచ్చామన్నది కాదు ఒక ప్రాణం నిలబెట్టేందుకు ఏం చేశామన్నది అంతకన్నా ముఖ్యమే. తాజాగా ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఎంత టెక్నాలజీ వచ్చినా, ప్రజల్లో ఆలోచన పరిణితి ఎంత పెరిగినా అవయవదానం అంటే అందరూ భయపడతారు. తాను చనిపోతూ మరొకరిని బ్రతికించటం ఎంతో గొప్ప విషయం. అయినా అవగాహన లేక కొందరు, పాత నమ్మకాలతో ఇంకొందరు దూరంగా ఉంటారు. కానీ, ప్రజలను చైతన్య పర్చాల్సిన బాధ్యత సర్కారుదే.
అవయవ దానం చేసిన వారి విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దానం చేసిన తర్వాత మరణించిన వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు సదరు వ్యక్తి అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్ కూడా హజరుకావాలని ఆదేశించింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10వేల ఆర్థిక సహయం కూడా చేయనున్నారు. జీవదాతగా మారిన వ్యక్తి వివరాలతో జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన కూడా జారీ చేయాల్సి ఉంటుంది.
ఈ చర్యలతో అవయవ దానం చేసేందుకు ప్రజలను చైతన్యపర్చటంతో పాటు తాను మరణిస్తూ ఇతరులను బ్రతికించిన వారిని ప్రభుత్వం గుర్తించినట్లు అవుతుంది. చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.