నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా.. అన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. దొడ్డిదారి ప్రయత్నాలు చేశారు… కానీ మొదటి సారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో నేరుగా హైకోర్టు తీర్పునకే వక్రభాష్యం చెప్పి.. ఆయన కొనసాగింపు చెల్లదని డిక్లేర్ చేసి.. ఆయనను బాధ్యతలు తీసుకోకుండా.. కొత్త వివాదం సృష్టించేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా… హైకోర్టు తీర్పుపై ఓ అడ్వకేట్ జనరల్ ప్రెస్‌మీట్ పెట్టారు. తాను ఫలానా న్యాయసలహా ఇచ్చానని చెప్పారు. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా వచ్చిన సర్క్యూలర్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించింది. అంతా ఓ వ్యూహం ప్రకారం జరిగిందన్న చర్చ జరుగుతోంది.
తొలగింపు జీవో చెల్లనప్పుడు రమేష్‌కుమార్ పదవిలో ఉన్నట్లే కదా..!?
నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను పునర్నియమించలేదనే వాదన ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. అడ్వకేట్ జనరల్ కూడా అదే చెబుతున్నారు. అసలు ఆయన పదవి కోల్పోతే కదా.. మళ్లీ నియమించడానకి అనే మౌలికమైన సందేహం.. న్యాయనిపుణుల నుంచి వస్తోంది. ఆయనను తొలగించేలా తీసుకు వచ్చిన ఆర్డినెన్స్.. దానికి సంబంధించిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. అందులో ఆయన పదవీ కాలం ముగిసిందని ఇచ్చిన జీవో కూడా ఉంది. అంటే.. ఆయన పదవిలో కొనసాగుతున్నట్లే అవుతుంది. ఈ విషయం తెలియడానికి న్యాయశాస్త్రంలో నిపుణులు కూడా కానక్కర్లేదు.. కాస్త కామన్సెన్స్ ఉంటే చాలని అంటున్నారు. అయితే.. ఏజీ మాత్రం ఎప్పుడూ లేని విధంగా ప్రెస్‌మీట్ పెట్టి… ఆయన ఆదేశాలు జారీ చేయడం చెల్లదని న్యాయసలహా ఇచ్చినట్లుగా ప్రకటించేశారు.
తీర్పుపై స్టే తెచ్చుకుని నిమ్మగడ్డను ఆపకుండా తీర్పునకే వక్రభాష్యం ఎందుకు..?
హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ప్రభుత్వానికి ఊరట దక్కదని.. ఇక్కడితో ఈ వివాదం ముగిస్తే.. మంచిదని పలువురు నిపుణులు ప్రభుత్వానికి సలహాలు కూడా ఇచ్చారు. అయితే.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. శరవేగంగా వెళ్లి స్టే తెచ్చుకుంటే.. ఈ వివాదానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ.. అటు హైకోర్టు అవకాశం ఇవ్వకుండా.. ఇటు సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకోకుండా.. తీర్పునకు వక్రభాష్యం చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి చేపట్టకుండా చేయడం వల్లనే విమర్శలు ఎదురవుతున్నాయి. తెలిసి మరీ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
“న్యాయసలహా” వ్యూహంతో ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ భయం లేకుండా వ్యూహం ..!?
అయితే ఈ విషయంలో.. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను బాధ్యతలు చేపట్టకుండా ఆపడంపై తర్వాత హైకోర్టు కోర్టు ధిక్కరణగా పరిగణించే అవకాశం ఉంది. అందుకే.. తమ తప్పేమీ లేదని ప్రభుత్వం వాదించేందుకు.. “న్యాయసలహా” పేరుతో కొత్త వ్యూహంలో వెళ్తోంది. ఆయన విధులు చేపట్టడం చట్ట విరుద్ధమని.. తాను న్యాయసలహా ఇచ్చానని.. స్వయంగా ఏజీ మీడియాకు చెప్పారు. న్యాయసలహా మేరకే నిమ్మగడ్డను అడ్డుకున్నామని.. తమకేం సంబంధం లేదని.. ప్రభుత్వం కోర్టులో వాదించే అవకాశం ఉంది. ఏం జరిగినా.. అది ఏజీ భరించాల్సి ఉంటుంది. హైకోర్టు ఆగ్రహం ప్రభుత్వం వైపు రాకుండా.. జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. అంటే.. కోర్టుధిక్కరణ అవుతుందని తెలిసి మరీ.. కొత్త రాజకీయం నడుపుతున్నట్లు భావించాల్సి వస్తోంది.