కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో ఘటనపై ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. కళాశాలలో హిడెన్ కెమెరాలు ఉన్నాయని విద్యార్ధినిల ఆందోళనతో విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది.
మంత్రి కొల్లుతోపాటు కలెక్టర్ , ఎస్పీ ఘటనాస్థలికి వెళ్ళాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
విద్యార్థినిల ఆందోళనలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న లోకేష్..హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. కళాశాలలో హిడెన్ కెమెరాలు ఉన్నట్లు తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతం, వేధింపులు లేకుండా విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేలా యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలన్నారు.