ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను విపక్షం బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకూ సభకు హాజరు కాకూడదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. అంతేకాదు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల్లోకే జగన్ వెళ్తున్నారంటూ పాదయాత్ర నేపథ్యాన్ని గైర్హాజరీకి కారణంగా చూపించారని చెప్పొచ్చు. నిజానికి, అసెంబ్లీకి విపక్షం వెళ్లకపోవడంపై చాలా విమర్శలే వినిపించాయి. మొత్తానికి, ఈసారి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకమైనవిగా చూడాలి. ఎందుకంటే, విపక్షమే లేకపోతే సభ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రజల్లో సహజంగా ఉంటుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఈసారి సభలో వాదోపవాదాలు ఉండవు, వాయిదాలు ఉండవు, స్పీకర్ పోడియం వద్దకు సభ్యులు దూసుకొచ్చే సన్నివేశాలు ఉండవు, వాక్ ఔట్లు ఉండవు, నిరసనలు ఉండవు. ఇలాంటి పరిస్థితిలో సభ నిర్వహించడం చెప్పుకోవడానికి ఈజీగా ఉన్నా.. ఆసక్తికరంగా నడపడం అధికార పార్టీకి ఒకింత సవాలుతో కూడుకొన్న వ్యవహారమే! అయితే, ప్రతిపక్షం లేకపోవడాన్ని కూడా తమకు అనుకూలంగా వాడుకోవాలని అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది.
అమరావతిలో జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అంశం ప్రస్థావనకు వచ్చింది. ప్రతిపక్షం లేకపోయినంత మాత్రాన సమావేశాలు ఆగిపోవు కదా, ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి, ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చ జరుపుదాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వీలైనన్ని ప్రజా సమస్యలు సభలో లేవనెత్తాలని ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇచ్చారు. సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, స్వల్ప వ్యవధి చర్చ, సావధాన తీర్మానం ఇలాంటివన్నీ పరిపూర్ణంగా నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
వైకాపా గైర్హాజరీని టీడీపీ మరోరకంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్షం అడ్డుకోవడం వల్లనే సమావేశాలు సజావుగా సాగడం లేదనే విమర్శ ప్రతీసారీ వారు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు విపక్షం లేదు కాబట్టి… సభా సమయాన్ని ఎంత ప్రయోజనకరంగా వాడొచ్చో ప్రజలకు చూపించబోతున్నారట! ప్రజల తరఫున సమస్యలపై కూడా అధికార పార్టీ సభ్యులే మాట్లాడతారట! అంటే, ఓరకంగా ప్రతిపక్ష పాత్రను కూడా వారే పోషించబోతున్నారన్నమాట! ‘ప్రతిపక్షం లేకపోవడం వల్లనే ఇన్ని ప్రజా సమస్యలు చర్చించగలిగాం’ అనే ప్రచారానికి వీలుగా వ్యూహరచన చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించలేదనే అంశాన్ని ఈ సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తానికి, అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో ఇప్పటికే వైకాపా కొన్ని విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని టీడీపీ ఇలా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనా, సమావేశాల బహిష్కరణ అనేది వైకాపా చేసిన వ్యూహాత్మక తప్పిదంగానే చెప్పాలి.