విశాఖ భూ కుంభకోణాలపై సాక్షాత్తూ మంత్రులే బహిరంగ రచ్చ చేసుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెదవి మెదిపింది లేదు. సమన్వయ కమిటీలో కఠినమైన చర్యలు ఏవో వుంటాయని కొందరు బిల్డప్ ఇచ్చినా అది కూడా వుత్తుత్తి హడావుడిగా ముగిసిపోయింది. మియాపూర్ భూ దందాలో అరెస్టయిన ఎంఎల్‌సి దీపక్‌రెడ్డిని ఎలాగూ సస్పెండ్ చేయకతప్పదనీ తెలుసు. కాని అతి ముఖ్యమైంది మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణల నిగ్గు తేల్చడం, తప్పయితే ఆయనపై చర్య తీసుకోవడం. సిబిఐ విచారణ జరపాలని గంటా లేఖ రాశారు కూడా. ఇదంతా అయిన తర్వాత ఏదో పార్టీ వ్యవహారమన్నట్టు సర్దుబాటు కోసం త్రిసభ్య కమిటిని వేసి సరిపెట్టడం దారుణం. అయ్యన్న పాత్రుడే గాక జిల్లా కలెక్టర్ కూడా వేల ఎకరాలు గల్లంతైనట్టు వెల్లడించారు. తర్వాత ప్రభుత్వ జోక్యంతో దాన్ని కేవలం 13 ఎకరాలకు తగ్గించారు. నిజానికి విభజితాంధ్ర ప్రదేశ్‌లో వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక కేంద్రంగా వున్న విశాఖ భూములపై డేగల్లా వాలుతున్న తీరు ప్రజలను ఆందోళనపరుస్తున్నది. రిషి కొండ భూములు, దసపల్లా భూములు, అటవీ భూములు అసైన్డ్ భూములు సింహాచలం దేశస్థానం భూములు ఇలా అనేక రకాలవి కలిపితే వేల ఎకరాల్లోనే వుంటాయి. అవన్నీ అక్రమార్కుల హస్తగతమైనాయి. వాటిని సత్వరం స్వాధీనం చేసుకుని నిందితులపై చర్య తీసుకునే బదులు అంతా సర్డుబాలు చేసి సమర్థించడానికి ప్రభుత్వం సిద్ధమై పోయింది. అందుకే కోరలు లేని సిట్ వేసింది.
గత మూడు రోజులలోనూ కలసిన ఎపి టిడిపి బిజెపి నాయకులే భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్టు అంగీకరించారు. అయిదు కోట్లతో 850 కోట్టకు ఒక ప్రబుద్దుఢు ఎసరు పెట్టిన ఫలితంగానే ఇదంతా జరిగిందని బిజెపి నాయకులొకరు చెప్పారు. తమ జాతీయ నాయకులకు కూడా దీంట్లో ప్రమేయం వుందని సూచనగా చెబుతూ ఇదంతా ఒక సామాజిక వర్గం కనుసన్నల్లో నడుస్తున్న నాటకం అని విమర్శించారు. బిజెపి శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు బహిరంగంగానే దీనిపై విమర్శ చేశారు గాని ఆయన కూడా ఈ వ్యవహారంలో మొదటి బాధితుడని అంటున్నారు. తన భూమి న్యాయంగా కొన్నా డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని టిడిపి మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహనరావు ఒక చర్చలో అన్నారు. పలువురు టిడిపి నేతలు కూడా ఈ కుంభకోణంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టడం గురించి తెలుగు360లో చాలా కాలం కిందటే రాశాను. అదో హ్యాపెనింగ్ సిటీగా మారిపోయింది. ఈ మధ్యలో బయిటపడని హ్యాపెనింగ్ ఇంకా చాలా వుంటున్నాయి. ఏది ఏమైనా వేల కోట్ల విలువైన విశాఖ భూములను కాపాడుకోవడం ఎలా అన్న సవాలే ఇప్పుడు స్థానికులను రాజకీయ నేతలను ఆందోళనపెడుతున్నది.