ఏబీవీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేసి తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. విచారణ జరిపిన తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు నాలుగు రోజుల తర్వాత తీర్పు ఇచ్చింది. శుక్రవారం ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కావాల్సి ఉంది.
టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీవీపై జగన్ సర్కార్ పగబట్టింది. మొదట ఆరు నెలలు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోగా తర్వాత తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేసింది. నాలుగున్నరేళ్లుగా ఆ ఆరోపణలను తేల్చలేకపోయింది. ఈ లోపు ఆయనను డిస్మిస్ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం తిరస్కరించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత క్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయన సర్వీస్ మొత్తం జీతం ఇవ్వాలని .. తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ రకరకాల సాకులు చెబుతూ… ప్రభుత్వ వేధిస్తూనే ఉంది.
క్యాట్ ఉత్తర్వాలు జారీ చేసి మూడు వారాలు దాటిపోతోంది. ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం సీఎస్ చేసిన తప్పిదం. హైకోర్టులో పిటిషన్ వేశామన్న కారణంగా పోస్టింగ్ ఇవ్వకపోవడం కూడా తప్పిదమే అవుతుంది. ఈ విషయంలోనూ సీఎస్ జవహర్ రెడ్డి గీత దాటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒక్క రోజులో పోస్టింగ్ ఇస్తారో లేదో కానీ.. ఈ విషయం ఐపీఎస్, ఐఏఎస్ వర్గాలకు భవిష్యత్ ప్రమాదకర పరిణామంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.