ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు నమోదైన కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్పీ విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరించింది. గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన కేసుపై విజయపాల్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో రఘురామ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా గాయాలు జరిగినట్లు సుప్రీంకోర్టు గతంలో అభిప్రాయపడిన అంశాన్ని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ముందస్తు బెయిల్ తో పాటు అరెస్ట్ చేయవద్దని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది.
కస్టడీలో ఎలాంటి టార్చర్ చేయలేదని, రూల్స్ ప్రకారమే ప్రవర్తించినట్లు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. పిటిషనర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.
2021లో తనపై రాజద్రోహం కేసు పెట్టి, రాత్రంతా హింసించారంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామ ఇటీవల ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ తో పాటు ఆనాటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఎస్పీ విజయ్ పాల్ పై ఇప్పటికే ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.