ప్రైవేటు ప్లేసుల్లో మండపాలు పెట్టుకుని వినాయక చవితి వేడుకలు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఈ అంశంపై జరుగుతున్న రాజకీయానికి తెరపడినట్లయింది. కోవిడ్ పేరుతో ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం.. బిజెపి నేతలు రోడ్డెక్కడంతో వివాదం ప్రారంభమయింది. ఇతర ఏ కార్యక్రమాలకు..ముఖ్యంగా ప్రభుత్వ, పార్టీకార్యక్రమాలకు లేని నిబంధనలు వినాయక చవితికే పెట్టడంతో ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపించింది.
ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులోలంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. విచారణ జరిపిన హైకోర్టు మత పరమైన వేడుకలను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ప్రజలకు ఉందని హైకోర్టు తెలిపింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక వేడుకలు జరపుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకే సారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని సూచించింది.
వినాయకచవితి పండుగకు సంబంధించి వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితి. ప్రస్తుతం హైకోర్టు తీర్పు ప్రకారం ప్రైవేటు ఓపెన్ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం పూజలు చేసుకోవచ్చు. ఆ ప్రకారం నిమజ్జనాలు చేసుకోవచ్చు. హైకోర్టు తీర్పుతో విగ్రహాల తయారీదారులకు కూడా కాస్త వెసులుబాటు లభిస్తుంది. ఇప్పటికే విగ్రహాలు తయారు చేసుకున్న వారు భారీగా నష్టపోకుండా వాటిని అమ్ముకునే వెసులుబాటు కూడా కలుగుతుంది.