ఏప్రిల్ 6.. పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. అద్భుతాలు జరిగితే తప్ప, అవిశ్వాస తీర్మానంపై భాజపా సర్కారుకు చర్చకు సిద్ధమవడం అనూహ్యం..! గడచిన కొన్ని రోజులుగా ‘సభ ఆర్డర్ లో లేదు’ అనే ఒక్క లైనుతో అవిశ్వాసాన్ని భాజపా తప్పించుకుంటూ వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం, ఏపీకి భాజపా చేసిన అన్యాయాన్ని ఇతర పార్టీలతో పంచుకోవడం, జాతీయ మీడియాలో ఏపీ అంశం ప్రముఖం కావడంతో.. భాజపా సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. చివరికి ,చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలను కూడా ప్రసారం చెయ్యొద్దంటూ టీవీ ఛానెళ్లకు ఆంక్షలు పెడుతున్న వైనాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై చర్చ ఉంటుందని ఊహించలేం.
అయితే, ఇదే సమయంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపా మాత్రం దూకుడుగా ఉంది. ఢిల్లీ నడిబొడ్డున అంతిమ పోరాటం అంటున్నారు. నేడే ఎంపీల రాజీనామా, ఆమరణ నిరాహార దీక్ష అని ప్రకటించారు. పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడ్డ మరుక్షణమే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేస్తామని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ దీక్షలు కూడా పార్లమెంటులో కాదు.. ఏపీ భవన్ లో మాత్రమే చేస్తారట! పార్లమెంటు కంటే ఏపీ భవన్ లో చేస్తేనే ప్రభావంతంగా ఉంటుందనీ, అందుకే ఆ వేదికను ఎంచుకున్నామంటూ వైకాపా నేతలు అంటున్నారు. దేశ రాజకీయాల్లో ఇదో చారిత్రక, అపూర్వ, అద్వితీయ ఘట్టం అంటూ ‘సాక్షి’ మొదలుపెట్టేసింది. ఆంధ్రుల ఆత్మగౌరవ బావుటాను వైకాపా ఎంపీలు ఎగరేస్తారని అభివర్ణించింది. ప్రత్యేక హోదా సాధన ఉద్యమం అనేది తమ సొంత పార్టీ కార్యక్రమంగా వైకాపా చూస్తున్నట్టు అనిపిస్తోంది. అవిశ్వాసం పెట్టిందీ వారే, అది చర్చకు రాదన్న నమ్మకంతో రాజీనామాలకు ముహూర్తాలు పెట్టుకున్నదీ వారే! దీనికి తోడు రాజీనామాలు చేస్తేనే నిఖార్సైన పోరాటం చేస్తున్నట్టు అభివర్ణిస్తున్నదీ వారే.
నిజానికి, వైకాపా ఎంపీలు కావొచ్చు.. టీడీపీ ఎంపీలు కావొచ్చు… రాజీనామాలు చేసి ఏం సాధిస్తారు..? వెంటనే ఉప ఎన్నికలు వస్తాయా..? అనుమానమే..! పోనీ, పాతిక మంది ఎంపీల సంఖ్య తగ్గిపోతే మోడీ సర్కారు గడగడలాడిపోతుందా… అదీ సాధ్యం కాదు. ఏపీకి ఎంపీలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే వేంటనే ప్రత్యేక హోదా వచ్చేస్తుందా… అలా చేస్తే ఏపీకి భాజపా మోకరిల్లునట్టు అవుతుంది కదా! కాబట్టి, అదీ అసాధ్యమే. అలాంటప్పుడు ఎందుకీ రాజీనామాలు..? ఎవర్ని ఉద్ధరించడానికి, ఏం సాధించడానికి..? ‘ఇదిగో మేం చేస్తున్నాం, టీడీపీ చేయడం లేదు. మాకు చిత్తశుద్ధి ఉంది, టీడీపీకి లేదు’ అనే వాదన కోసం తప్పితే, ఏరకంగా చూసుకున్నా వైకాపా ఎంపీలు చేయబోతున్న రాజీనామాలు రాజకీయంగా ప్రభావితం చేయలేవు. అయితే, వైకాపాని ఆంధ్రాలో హీరో చేయడం ద్వారా టీడీపీని దెబ్బకొట్టొచ్చనే దుర్బుద్ధి కోణంలో భాజపా ఆలోచిస్తే తప్ప… ఈ రాజీనామాలకు ఎలాంటి ప్రాధాన్యతా ఉండదు. తెలుగుదేశాన్ని విమర్శించడానికి మరో సాకును దొరకబుచ్చుకోవడమే వైకాపా ఎంపీల రాజీనామా లక్ష్యం. అంతకుమించి, కేంద్రంతో మీరు చేసిన పోరాటమూ లేదూ, దాన్లో చివరి దశ ఇదీ అంటే ఆంధ్రులు నమ్మే పరిస్థితిలో అంతకన్నా లేరు.