ప్రఖ్యాత పరిశోధనాలయం నుంచి ఓ ప్రమాదకర రసాయనం మిస్సయింది. అది లీకయితే.. మానవాళికి ప్రమాదం. దాన్ని ఎవరు తీసుకెళ్లారు..? వాళ్లు లక్ష్యం ఏమిటి..? అది లీకయితే మానవాళిని ఎలా కాపాడాలి..?.. ఇది ఓ సినిమా స్క్రిప్ట్ కి రా పాయింట్లు కాదు. నిజంగానే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అంశం. ఆ కథ ఇదే. రెండు రోజుల కిందట… తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఓఎన్జీసీ అధికారులు ఓ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏముందంటే… సీజియం-137 అనే కెమికల్ ఉంచి 30 కిలోల బరువుండే కంటైనర్ కనిపించడం లేదనేదే ఆ ఫిర్యాదు. చముల నిల్వల అన్వేషణలో.. అదో పదార్థం అని పోలీసులు రొటీన్‌గా కేసు నమోదు చేసుకున్నారు కానీ… ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఒత్తిడితో… వారికి మైండ్ బ్లాంక్ అవుతోంది.
ఇంతకీ ఈ సీజియం-137 ఏమిటి..? ఇదో ఐసోటోప్. అత్యంత రేడియో ధార్మిక పదార్థమైన యురేనియం-235ను న్యూక్లియర్ విచ్ఛిత్తి చేసి తయారు చేస్తారు. ప్రమాదకరమైన ఈ రేడియో ధార్మిక పదార్థం వాతావరణంలో అత్యంత వేగంగా కలిసిపోతుంది. దాని ప్రభావం మనుషులతో పాటు ఇతర జీవులు, వాతావరణంపై కూడా ఉంటుంది. ఇది ఒక క్షార లోహం. ఘన రూపంలో తెల్లటి చిన్న బిస్కట్ ముక్క, టాబ్లెట్ మాదిరిగా రెండు నుంచి మూడు అంగుళాలు ఉంటుంది. దీని నుంచి వెలువడే ఆల్ఫా, బీటా, గామా కిరణాలు పర్యావరణానికి, జీవరాశికి చేటుచేస్తాయి. ఇది గాల్లో కలిసినా.. నీటిలో కలిసినా స్లోపాయిజన్‌గా మనిషిపై ప్రభావం చూపెడుతుంది. ఓఎన్జీసీ వంటి సంస్థలు భూమి పొరల్లో కొన్ని వేల అడుగుల కింద ఉండే చమురు, సహజవాయు నిక్షేపాలను కనుగొనే క్రమంలో సీజియం ఐసోటోప్-137 ఉపయోగిస్తారు.
ఇదే మిస్సయింది. ఫార్మాలిటిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ.. దీని కోసం.. కేంద్ర మంత్రిత్వ శాఖలతో పాటు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఓఎన్జీసీ, న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్ వంటి సంస్థలు రంగంలోకి దిగాయి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా పని ప్రారంభించారు. ఎవరైనా దొంగిలించారా..? లేక మిస్సయిందా అనేది.. ఇప్పుడు అందరికీ మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా మారింది. పొరపాటు లీకయితే.. ఓ పెద్ద ఉపద్రవం రావడం ఖాయం. అందుకే.. ఇప్పుడు.. ఏపీలో సినిమా స్టైల్లో దీనికి సంబంధించిన ఆపరేషన్ జరుగుతోంది. మరి ముగింపు ఎలా ఉండబోతోంది..?