ఆంధ్రప్రదేశ్‌లో సర్వీసులో ఉన్న పోలీసులపై ప్రభుత్వాధినేత నమ్మకం కోల్పోయినట్లుగా ఉన్నారు. అత్యంత కీలక బాధ్యతల్లో ఉన్న వారి పవర్స్ తగ్గిస్తూ.. ప్రత్యేకాధికారులను నియమిస్తున్నారు. ఇదంతా గుట్టుగా సాగిపోతోంది. ఉన్నత స్థాయిలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ.. ఓఎస్డీల నియామకం పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రస్తుతం నియామకాలు పోలీసు శాఖలో సంచలనంగా మారాయి. ఓఎస్డీల నియామకం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డీజీపీ కార్యాలయంలో ఓ రిటైర్డు అధికారిని నియమించ డంంతో పాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో తెలంగాణకు చెందిన ఓ రిటైర్డు అధికారిని ఓఎస్డీగా నియమించినట్లు తెలుస్తోంది.
డీజీపీ వ్యవహారశైలిపై జగన్ కు నమ్మకం కుదరడం లేదు. ఆయన పూర్తి స్థాయిలో వైసీపీకి మద్దతుగా లా అండ్ ఆర్డర్ పోలీసుల్ని మరల్చడంలో వైఫల్యం చెందారని అనుకుంటున్నారు. జీవో వన్ ను గట్టిగా అమలు చేయాలని విపక్ష నేతలను రోడ్డెక్కకుండా చేయాలని ఆయన పట్టుబడుతున్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు ఆయన అంచనాలను అందుకోలేకపోతున్నారు. అలాగే.. ఇంటలిజెన్స్ చీఫ్ వ్యవహారంపైనా జగన్ కు అనుమానం వచ్చిందని అంటున్నారు. అన్ని విషయాలు బయటకు తెలుస్తున్నాయని అనుకుంటున్నారు. అయితే అసలు గుట్టు ఇంటలిజెన్స్ చీఫ్ చేతిలో ఉండటంతో ఇప్పటికిప్పుడు ఆయనను తొలగించడం మంచిది కాదని భావిస్తున్నారు.
అందుకే కొత్తగా బయట వ్యక్తులను ఓఎస్డీలుగా నియమిస్తున్నట్లుగా చెబుతున్నారు. డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లకు సంబంధం లేకుండా వారితోనే ఎన్నికలు నిర్వహించుకునేలా.., పూర్తి అధికారాలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖలో సంచలనం అవుతోంది. రాష్ట్రంలో కింది స్థాయి పోలీసు అధికారులు పదోన్నతులకు నోచుకోకుండా ఓఎస్డీల నియామకం జరుపుతున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అయినా సీఎం జగన్ మాత్రం.. తనకు నమ్మకస్తులైన వారిని రిటైరైనా సరే తెచ్చి అనధికారిక డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ లుగా నియమించుకుని పని పూర్తి చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.