నర్సరావుపేట వెళ్లాలనుకున్న నారా లోకేష్‌ను పోలీసులు విజవంతంగా అడ్డుకున్నారు. ఆయన గన్నవరం ఎయిర్ పోర్టులో దిగినప్పటి నుండి బయటకు దిగనీయలేదు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఆయనను చివరికి ఉండవల్లిలోని ఇంటివద్ద వదిలి పెట్టారు. ఎంత అడుగుతున్నా ఎందుకు ఆపుతున్నారు.. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో పోలీసులు చెప్పలేకపోయారు. చివరికి అనుమతి లేకుండా ర్యాలీగా వస్తున్నారని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని.. కోవిడ్ రూల్స్ ఉల్లంఘించారని చేత్తో రాసిన నోటీసులను ఇచ్చిన పోలీసులు ఆయనను ఇంటి వద్ద వదిలి పెట్టారు.
లోకేష్ నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కోట అనూష కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నారు. ఎక్కడా ధర్నాలు.. ఆందోళనలకు పిలుపునివ్వలేదు. కానీ పోలీసులు మాత్రం నర్సరావుపేట వెళ్లడం నేరమన్నట్లుగా గన్నవరంలోనే నిలిపివేశారు. పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. గన్నవరం నుంచి బయటకు వెళ్తే నర్సరావుపేట దారిలో ఎక్కడైనా ఆపడానికి దారి పొడవునా పోలీసులను మోహరించారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. పోలీసుల తమ తీరుతో లోకేష్ నర్సరావుపేట ఎందుకు వెళ్లకూడదు.. అన్న సందేహం అందరికీ వచ్చేలా చేశారు.
లోకేష్ గతంలో కర్నూలుకు వెళ్లారు. ఇతర చోట్లకు కూడా పరామర్శలకు వెళ్లారు. అక్కడ అడ్డుకోలేదు కానీ నర్సరావుపేటకు వెళ్తే మాత్రం ఎందుకు అడ్డుకున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. ముందు రోజు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్‌మీట్ పెట్టి అనుమతి లేదని ప్రకటించడం తర్వాతి రోజు పోలీసు మ్యాన్ పవర్ మొత్తాన్ని ఉపయోగించడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. లోకేష్ పర్యటనను పోలీసులు పట్టించుకోక పోయి ఉంటే ఆయన వెళ్లి కోట అనూష కుటుంబాన్ని పరామర్శించి .. ప్రభుత్వంపై విమర్శలు చేసి వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజంతా లోకేష్‌కు పబ్లిసిటీ చేశారని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.