కృష్ణా నదీజలాల వాటా కోసం రెండు తెలుగు రాష్ట్రాలూ గట్టిగానే పట్టుబడుతున్నాయి. ఈ నీటి వాటాలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ వాదిస్తోంది. అది అబద్ధమని ఏపీ ఖండిసోంది. చివరకు రెండు రాష్ట్రాలూ తమ తమ వాదనలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వినిపించడానికి సిద్ధమయ్యాయి. కృష్ణా నీటి వాటాకోసం వాదన వినిపించడానికి మొదటి అవకాశం తెలంగాణకు వచ్చింది.
కృష్ణా జలాల కేటాయింపులో తమకు చాలా అన్యాయం జరిగిందని తెలంగాణ వాదించింది.
వాస్తవంగా తమకు ఇంకో 200 టీఎంసీలు రావాలని పేర్కొంది. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన ఒప్పందాలు అమలై ఉంటే తమ రాష్ట్రంలో కాలువల ద్వారానే నీరందేదని తెలంగాణ వాదించింది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడటానికి ముందు, ఆనాటి హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలు ఉమ్మడిగా నాగార్జున సాగర్ నిర్మాణాన్ని చేపట్టాయి. అప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను అమలు చేయకుండా తుంగలో తొక్కారనేది తెలంగాణ అభియోగం.
కృష్ణా నది ప్రవహించే ప్రాంతాలు, వాటి స్థితిగతులను తెలంగాణ సమగ్రంగా వివరించింది. తీవ్ర కరువు పీడిత ప్రాంతాలతో పాటు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలున్న విషయాన్ని గుర్తు చేసింది. అత్యంత వెనుకబడిన ప్రాంతాలను పరిగణన లోకి తీసుకోవాలని సూచించింది. ఇలా చేస్తే తెలంగాణలోని కృష్ణా బేసిన్ అవసరం 500 నుంచి 550 టీఎంసీలని వివరించింది.
రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచీ నీటి వివాదాలు ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ వివాదం నిజంగానే జలయుద్ధంగా మారింది. రెండు రాష్ట్రాల పోలీసులూ నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఒక రకమైన యుద్ధానికి దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. తోపులాటకు దిగారు. లాఠీలు ఎత్తి కలబడ్డారు. ఆనాటి ఘర్షణల్లో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయి.
కృష్ణా నదీజలాల వివాదం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మరోవైపు ఎగువ రాష్ట్రాల వైఖరి కూడా వివాదానికి ఆజ్యం పోస్తోంది. తెలంగాణ తర్వాత ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది. ఆ తర్వాతైనా వివాదానికి తెరపడుతుందేమో చూద్దాం.